సాధారణంగా సినీ, రాజకీయలు లేదా మరే రంగానికి చెందిన ప్రముఖులపై కోర్టు కేసులు నడుస్తున్నట్లయితే, వాటి తీవ్రతని బట్టి కోర్టులు ఆంక్షలతో కూడిన బెయిల్‌పై మంజూరు చేస్తుంటాయి. విదేశీ పర్యటనలపై ఆంక్షలు కూడా విధించవచ్చు.
ఉదాహరణకు అక్రమాస్తుల కేసులలో బెయిల్‌పై ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి తీసుకునేవారు. ప్రతిపక్షంలోకి మారినా కోర్టు అనుమతి తప్పనిసరి. కేసుల కారణంగా ఇలాంటి అవమానకర ఆంక్షలు భరించక తప్పదు.
కానీ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి లండన్, అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్ళాలనుకుంటే, విదేశాంగ శాఖ అమెరికా పర్యటనకు అనుమతించకపోవడం విశేషం.
కనుక సిఎం రేవంత్ అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని అదివారం రాత్రి హైదరాబాద్ తిరిగి చేరుకోనున్నారు. దీనిపై ఆయనతో సహా తెలంగాణ కాంగ్రెస్ కూడా భగ్గుమంటోంది.
విద్యారంగంలో విదేశీ యూనివర్సిటీలతో భాగస్వామ్య ఒప్పందం చేసుకునేందుకు సిఎం రేవంత్ రెడ్డి బయలుదేరితే, దానిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడంపై తీవ్ర అభ్యంతరం చెప్పారు.
రాష్ట్రాల ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలను కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయడం, అందుకు దానికి అధికారాలు కలిగి ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
భారత రాజ్యాంగ నిర్మాతలు ఆనాడే ఇలాంటి ప్రతీ అంశంపై లోతుగా అధ్యయనం చేసి రాజ్యాంగంలో నిబంధనలు పొందుపరచడం వారి దూరదృష్టి, మేధస్సుకు నిదర్శనంగా భావించవచ్చు. కానీ అవి యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, తీవ్రమైన నేరాలు, అంతర్జాతీయ సమస్యలు వంటి సందర్భాలలో ఇలాంటి ఆంక్షలు విధించేలా రాజ్యాంగంలో నిబంధనలు పొందుపరిచి ఉండవచ్చు.
కానీ వాటిని ఈవిధంగా ముఖ్యమంత్రిపై ప్రయోగించడం అవసరమా? అంటే అవసరమనే అంటున్నారు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.
ఆయనేమన్నారంటే, “దేశంలోని ప్రముఖుల పదవి, హోదా, వారి విదేశీ పర్యటనల షెడ్యూల్, అక్కడ వారు పాల్గొనే కార్యక్రమాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. అన్నీ సవ్యంగా ఉంటే అనుమతిస్తుంది. కానీ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి పర్యటన, కార్యక్రమాలు నిబంధనలకు భిన్నంగా ఉన్నందున అనుమతి లభించలేదు. దీనిలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదు,” అని అన్నారు.
ఇలాంటి సమస్య చాలా మంది ముఖ్యమంత్రులకు ఎదురయ్యి ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఎదురవడంతో ఇది తెలంగాణలో కాంగ్రెస్-బిజేపిల మద్య కొత్త యుద్ధానికి ఇందనంగా మారవచ్చు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం కక్షసాధింపు ధోరణికి ఇది నిదర్శనమనే వాదనలు వినిపించవచ్చు.





