టాలీవుడ్ స్థాయి ఆస్కార్ దాకా వెళ్ళాక ఇప్పుడు బాలీవుడ్డే కాదు అమెరికా లాంటి దేశాల్లోనూ మన ఫిలిం మేకింగ్ మీద ఆసక్తి పెరుగుతోంది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ రికార్డులు సాధించడం తలలు పండిన విశ్లేషకులు సైతం అంచనా వేయలేదు. యుఎస్ లో ఏడాది పాటు ప్రీమియర్లు హౌస్ ఫుల్ కావడం ఊహించలేదు. ఇదంతా టాలీవుడ్ ఎదుగుదలకు సంకేతం. అందుకే సాంకేతికంగా మనమింకా ఉన్నతంగా ఎదగాల్సిన అవసరం చాలా ఉంది. అందులో ప్రధానమైంది 3D. ఇదేమీ కొత్త టెక్నాలజీ కాదు. దశాబ్దాల తరబడి ఉన్నదే. ఇంట్లో పెద్దోళ్లను అడిగితే ఎప్పుడో ఎనభై దశకంలో వచ్చిన చిన్నారి చేతన్ గురించి కథలుగా చెబుతారు. ఇప్పుడంతా మారిపోయింది.
స్క్రీన్లు అప్ గ్రేడ్ అయ్యాయి. కళ్లుచెదిరే ఐమ్యాక్స్ తెరలు ఎన్ని వందలు ఖర్చు పెట్టినా పర్వాలేదనిపించేలా ప్రేక్షకులను ఊరిస్తున్నాయి. నగరాలూ పట్టణాల్లో ఉండే థియేటర్లు మారుతున్న ప్రేక్షకుల డిమాండ్ కు తగ్గట్టు 4కెలు డాల్బీ విజన్ లు కోట్లు పెట్టుబడి పెట్టి తెచ్చుకుంటున్నాయి. మరి మన సినిమా మేకింగ్ ఆ స్థాయికి చేరుకుందా అంటే ఇది తరచి చూసి సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్న. ఇప్పటిదాకా ఇండియాలో చాలానే త్రిడి చిత్రాలొచ్చాయి. వాటిలో బ్లాక్ బస్టర్లు తక్కువే. కానీ గొప్ప అనుభూతిని మిగిల్చినవి ఏవీ అంటే వెంటనే చెప్పలేని పరిస్థితి.
ఈగ, బాహుబలి, రోబో, 2.0 తదితర ప్యాన్ ఇండియా మూవీస్ ఆడియన్స్ ని గొప్పగా అలరించాయి కానీ త్రీడి విషయంలో మాత్రం అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోలేకపోయాయి. కారణం ఆ టెక్నాలజీకి కావాల్సిన కెమెరాను వాడకుండా ముందు టూ డిలో షూటింగ్ చేసి దాన్ని కన్వర్ట్ చేసే ప్రయత్నం చేయడం. శాకుంతలం కూడా అదే చేశారు. ఎప్పుడో నవంబర్ లో పూర్తయితే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఫారిన్ కంపెనీని సంప్రదించి మార్పించారు. రుద్రమదేవికి గతంలో ఇదే ఫాలో అయ్యారు. టికెట్ మీద అదనంగా ముప్పై రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల చూసేవాళ్లకు ఆ అనుభూతి తగిన న్యాయం చేయాలి.
ఉదాహరణకు అవతార్, అవెంజర్లు చూసినప్పుడు ఏ ఎక్స్ పీరియన్స్ దక్కించుకుంటామో వాటినే మన సినిమాలూ ఇవ్వగలిగినపుడు ఖచ్చితంగా ఇలాంటివి ప్రోత్సహించాలి అనిపిస్తుంది. అప్పుడెప్పుడో కళ్యాణ్ రామ్ ఓంని త్రీడిలోనే తీయించాడు. జనం పట్టించుకోలేదు. బాలీవుడ్ లో హాంటెడ్, శాప్, తానాజీ, తగ్స్ అఫ్ హిందుస్థాన్, బ్రహ్మాస్త్ర పార్ట్ 1 ఇలా బోలెడు వచ్చాయి కానీ ఏవీ గుర్తుండిపోయేలా మెప్పించలేదు. హిట్ అయిన సినిమాలు కూడా టూడినే బెటరనిపించాయి. ట్రిపులార్ సైతం త్రీడి వెర్షన్ పెద్దగా ఆడలేదనే విషయం మర్చిపోకూడదు. ఇకపై ఈ విభాగంలో మన ముద్ర పడాలంటే దర్శక నిర్మాతలు స్క్రిప్ట్ స్టేజి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి సినిమాని త్రీడీలోనే చూడాలనే ఫీలింగ్ కలుగుతుంది.



