దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరుతో ముగించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కేసు విచారణ నాలుగేళ్ళు కొనసాగింది కనుక సుప్రీంకోర్టు మరోసారి పొడిగింపుకు అనుమతించకపోవచ్చు. కనుక మిగిలిన ఈ 15 రోజులు అటు వైసీపీలో నిందితులలకి, ఇటు సీబీఐకి కూడా చాలా కీలకమే అని చెప్పవచ్చు.
కనుక సీబీఐ ఈ కేసు విచారణను వేగవంతం చేస్తూ కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి, కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది. అతను విచారణకు సహకరించడం లేదని, పారిపోయేందుకు ప్రయత్నించవచ్చు కనుకనే అరెస్ట్ చేయవలసి వచ్చిందని సీబీఐ కోర్టుకి తెలియజేసింది.
వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనే అతను ఉన్నాడని, వివేకా చనిపోయారనే విషయం శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి అవినాష్ రెడ్డికి చెప్పిన తర్వాత ఆయన ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి వివేకా ఇంటికి చేరుకొన్నారని సీబీఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
ఆ తర్వాత అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి కలిసి హత్యకు సంబందించిన సాక్ష్యాధారాలు చెరిపివేసిన్నట్లు గుర్తించామని సీబీఐ పేర్కొంది. తర్వాత అందరూ కలిసి వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని, ఇది ఉద్దేశ్యపూర్వకంగా హత్యను దాచిపెట్టడమే అని సీబీఐ పేర్కొంది. కనుక ఈ సాక్ష్యాధారాలన్నీ నిందితులే వివేకానందా రెడ్డిని దారుణంగా హత్య చేసినట్లు స్పష్టం అవుతోందని సీబీఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
ఏప్రిల్ నెలాఖరులోగా ఈ కేసు విచారణను ముగించాలనే సుప్రీంకోర్టు ఆదేశాల నేపధ్యంలో ఆలోగా మరిన్ని బలమైన సాక్ష్యాధారాలను సేకరించి నిందితులను దోషులుగా నిర్ధారించేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఈ కేసులో న్యాయస్థానం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తదితరులను దోషులుగా తీర్పు చెప్పితే, వారందరూ పైకోర్టులో అప్పీలు చేసుకొని ఈ కేసును మరికొన్ని నెలలు లేదా ఏళ్ళు సాగదీయవచ్చు. కానీ ముందుగా అవినాష్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే కోడికత్తి కేసు ఓ డ్రామా అని దానిలో ఎటువంటి రాజకీయ కుట్రలు లేవని ఎన్ఐఏ తేల్చి చెప్పేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కీలకపాత్ర పోషించారని ఈడీ, సీబీఐలు పేర్కొన్నాయి. కనుక ఇప్పుడు వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి దోషి అని కోర్టు తీర్పు చెపితే ఇంతకాలం ప్రభుత్వ పెద్దలే వారిని వెనకేసుకు వస్తున్నందున, ప్రతిపక్షాలు సిఎం జగన్మోహన్ రెడ్డిని గట్టిగా నిలదీయడం ఖాయం.



