సినిమాలలో హీరోయిన్లు పొట్టి దుస్తులు వేసుకొని అందాల ప్రదర్శన చేసే దశ లిప్ లాకుల దశలు దాటి ఇప్పుడు ‘ఇంటిమేట్ సీన్స్’ కూడా చేసేస్తున్నారు.
భార్యాపిల్లలు ఉన్న హీరోలు కూడా ‘కేవలం అభిమానులను సంతోషపెట్టడం కోసమే’ మొహమాటపడకుండా ఆ సీన్స్ చేసేస్తున్నారు.
వాటిని వారి ఇంట్లో తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరూ చూడరా?అనే సందేహం కలుగుతుంటుంది. బహుశః అందుకేనేమో ఆ ‘హాట్ సీన్’ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డామని ఓ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తుంటారు. అంటే అయిష్టంగానే అవన్నీ చేస్తున్నామని నమ్మమంటున్నారన్న మాట!
వందల కోట్లు పెట్టుబడితో తీస్తున్న సినిమాలలో వాళ్ళు ‘అలా నటిస్తున్నారు’ కనుక అదంతా సినిమా కోసమే అని నమ్మేద్దాం. కానీ యువతీ యువకులు, చివరికి బుద్దిగా సంసారాలు చేసుకునే మొగుడూ లేదా పెళ్ళాం లేదా మొగుడూ పెళ్ళాలు కూడా రీల్స్ పేరుతో రెచ్చిపోతున్నారే?ఎవరి కోసం?
కొందరు కామెడీ స్కిట్స్‌కి పరిమితమైతే కొందరు బట్టలూడదీసుకొని మరీ డ్యాన్సులు చేసేస్తున్నారు.
ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియాలో అశ్లీల ఫోటోలు, వీడియోలు వచ్చాయంటే భయపడే రోజులు పోయాయి. ఎవరికి వారే అశ్లీల ఫోటోలు, వీడియోలు చేసి పెట్టేస్తున్నారు.
కొంతమంది మొగుడూ పెళ్ళాలు తమ బెడ్ రూమ్ ముచ్చట్లు, సీన్స్ కూడా పెట్టేస్తున్నారు. ‘ఎవరైనా చూస్తారేమో అని భయపడే బదులు అందరూ చూడాలి… లైక్స్ రావాలి… దాంతో డబ్బు రావాలి’ అనే దశకు చేరుకోవడం చూస్తుంటే ఈ సమాజం ఎటువైపు పోతోందో… చివరికి ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోబోతోందో ఎవరూ ఊహించలేరు.
ముఖ్యంగా స్కూలు పిల్లలకు కూడా మొబైల్ ఫోన్లు, ట్యాబ్స్, వాటికి అపరిమిత ఇంటర్నెట్ సదుపాయం, స్కూళ్ళు, పార్కులు బహిరంగ ప్రదేశాలలో కూడా ఉచిత వైఫీ సౌకర్యం లభిస్తుండటంతో ఒకప్పుడు కార్టూన్ చిత్రాలు మాత్రమే చూసే చిన్న పిల్లలు కూడా క్రైమ్, అశ్లీల చిత్రాలు చూడగలుగుతున్నారు. వాటిని చూస్తూ పెరుగుతున్న భావి భారత పౌరులు ఏవిదంగా తయారవుతారో ఊహించుకోవచ్చు.
ఇప్పుడు ఓటీటీలలో కూడా సెక్స్, హింస, రక్తపాతం, బూతులతో వస్తున్న వెబ్ సిరీస్, సినిమాలను పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ‘రాణా నాయుడు’ హిట్ అవడమే ఇందుకు నిదర్శనం.
పెద్దవారు అటువంటి వాటి ప్రభావానికి లోనవకపోవచ్చు కానీ యువత, పిల్లలు?భారతీయులు ఎన్నో దశాబ్ధాలుగా వీటిని చూసేందుకు నోచుకోకపోవడంతో వారి ‘దాహర్తి’ని తీర్చే బాధ్యతని సినిమాలు, వెబ్ సిరీస్, మీడియా, సోషల్ మీడియా తీసుకుని నెరవేర్చుతున్నట్లు ఉంది తప్ప ఎవరూ ఇది తప్పని భావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కనుక ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, దాంతో వ్యవస్థలలో, సమాజంలో వస్తున్న ఈ అవాంఛనీయ మార్పులు, అంతా వినాశనానికే దారి తీయబోతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ వినాశనాన్ని ఆపడం ఎవరివల్లా కాకపోవచ్చు.
ఈ మార్పుల వలన బంధుత్వాలు తగ్గి కుటుంబ సభ్యుల మద్య నానాటికీ దూరం పెరిగిపోతోంది. కనుక సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్న ఈ సమాజం భవిష్యత్ ఏవిదంగా ఉండబోతోందో ఊహించడం కష్టమే.





