చంద్రబాబు రోడ్ షోలలో తొక్కిసలాటలు.. మరింత జాగ్రత్తలు అవసరం లేకుంటే…

Stampedes at chandrababu Naidu Guntur Meetingవారం రోజుల క్రితం చంద్రబాబు నాయుడు కందుకూరు పట్టణంలో రోడ్ షో నిర్వహించినప్పుడు జరిగిన తొక్కిసలాటలలో 8 మంది చనిపోయారు. నిన్నగుంటూరు జిల్లాలో పర్యటించినప్పుడు కూడా తొక్కిసలాటలలో ముగ్గురు చనిపోయారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉయ్యూరు ఫౌండేషన్ అధ్వర్యంలో సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరైనప్పుడు ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “మేము ముందుగా పోలీసుల అనుమతి తీసుకొనే మా కార్యక్రమాలు నిర్వహించుకొంటున్నాము. కానీ చంద్రబాబు నాయుడు సభలు, రోడ్ షోలకి పోలీసులు తగినంత భద్రత కల్పించడం లేదు. కనుక ఈ ఘటనలకు భద్రతా వైఫల్యమే కారణమని భావిస్తున్నాము. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగినంత భద్రతా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు గత 40 ఏళ్ళుగా రాజకీయాలలో ఉన్నారు. ఈ 40 ఏళ్ళలో లక్షల మందితో మహానాడు వంటి భారీ సభలు ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా నిర్వహించారు. కానీ ఆయన పర్యటనలలో వరుసగా రెండుసార్లు తొక్కిసలాటలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం టిడిపికి కూడా చాలా చెడ్డపేరు, న్యాయ పరమైన సమస్యలు తెచ్చిపెడుతుంది. కనుక టిడిపి నేతలు తమ కార్యకర్తల సాయంతో అదనపు భద్రత ఏర్పాటు చేసుకోవడం మంచిది.

మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతమైతే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు సభలు, రోడ్ షోలకి పోలీసులు అనుమతి నిరాకరిస్తే టిడిపి రాజకీయంగా కూడా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. ఒక్క టిడిపికే కాదు రాష్ట్రంలో అన్ని పార్టీలకీ ఇదే వర్తిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories