ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి ఏ ముహూర్తంలో మూడు రాజధానులు పెట్టాలనే ఆలోచన వచ్చిందో కానీ నాలుగేళ్ళలో ఆ పేరుతో మంత్రులు హడావుడే తప్ప ఆ దిశలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. జూలైలో విశాఖకు షిఫ్ట్ అవుదామని సిఎం జగన్ ఎందుకు అన్నారో తెలీదు కానీ సుప్రీంకోర్టు కూడా ఈ కేసు తదుపరి విచారణను జూలై 11కి వాయిదా వేసింది!
హైకోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయని సుప్రీంకోర్టులో ఈ పంచాయతీ పెడితే, అక్కడా వైసీపీ ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఈ కేసుపై ఈరోజు (మార్చి 28)న విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించడంతో, నేడు సానుకూలంగా తీర్పు వస్తుందనుకొంటే, దీనిని అత్యవసరంగా విచారణ చేపట్టలేమని తేల్చి చెపుతూ జూలై 11వ తేదీకి వాయిదా వేసింది. అంటే దాదాపు నాలుగు నెలల తర్వాత అన్న మాట!
ఈ కేసును త్వరగా విచారణ చేపట్టాలనే ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదుల అభ్యర్ధనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కనీసం రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలనే అభ్యర్ధనను కూడా తిరస్కరించింది. అయితే ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న కొందరు రైతులు చనిపోయినందున, వారి స్థానంలో వారి ప్రతినిధులను చేర్చుకొనేందుకు అంగీకరించాలనే ప్రతివాదుల తరపు న్యాయవాదుల అభ్యర్ధనను సుప్రీంకోర్టు మన్నించింది.
జస్టిస్ జోసఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈరోజు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కేసును విచారిస్తున్నప్పుడు, ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు మరోసారి ఈ కేసు గురించి ప్రస్తావించబోగా, న్యాయమూర్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ కేసు విచారణ జరుగుతుండగా మద్యలో మరో కేసుని విచారించమని ఏవిదంగా అడుగుతున్నారని ప్రశ్నించారు. జూలై 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే అని స్పష్టం చేశారు.
ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు అభిమతం లేదా అభిప్రాయం ఏవిదంగా ఉందో ఈ వాయిదాలతోనే అర్దం అవుతోంది. జూలైలో విచారణ చేపట్టినా మళ్ళీ అప్పుడూ విచారణను మరో 3-4 నెలలు వాయిదా వేయదనుకోలేము. కనుక వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా హుందాగా తన మూడు రాజధానుల ఆలోచన సరికాదని, దానిని అమలుచేయలేమని గ్రహించి హుందాగా ఒప్పుకొని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల ప్రకారం అమరావతి నిర్మాణపనులను మొదలుపెడితే ప్రజలు కూడా వైసీపీ తప్పిదాన్ని మన్నించే అవకాశం ఉంటుంది. లేకుంటే వచ్చే ఎన్నికలలో ఇదే వైసీపీకి ఉరితాడుగా మారినా ఆశ్చర్యం లేదు.



