జగన్‌ని పర్యటన అడ్డుకుంటే ఫ్రీ పబ్లిసిటీ, విమర్శలు

TDP Faces Criticism for Restricting Jagan’s Roadshow

ఒక ప్రభుత్వం చేసిన మంచి పనులను మరో ప్రభుత్వం కొనసాగిస్తే అందరూ హర్షిస్తారు. కానీ తప్పులను, చెడు పనులను కూడా అనుకరిస్తే సామాన్య ప్రజలు సైతం విమర్శిస్తారు.

ఇదివరకు వైసీపీ హయంలో టీడీపి, జనసేన నేతల కదలికలని కట్టడి చేస్తుండేది. పవన్‌ కళ్యాణ్‌ విశాఖ పర్యటనకి వస్తే ఆర్‌కే బీచ్ రోడ్డులో ఓ హోటల్లో నుంచి బయటకు రాకుండా నిర్బంధించి, మళ్ళీ వెనక్కు తిప్పి పంపేశారు.

ADVERTISEMENT

నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు అడ్డుకునేందుకు జగన్‌ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది.

అమరావతి రైతులు పాదయాత్రలు చేయబోతే వారిపై వైసీపీ శ్రేణులతో దాడులు చేయించింది. పోలీసులతో అడ్డగించి వెనక్కు తిప్పి పంపించింది. చివరికి చంద్రబాబు నాయుడుని జైల్లో నిర్బందించింది.

నాడు జగన్‌ ప్రభుత్వ తీరుని రాష్ట్రంలో సామాన్య ప్రజలు సైతం తప్పు పట్టారు. కానీ అయన తీరు మారకపోవడంతో గద్దె దించేశారు.

ఇవన్నీ స్వయంగా చూసి, అనుభవించిన తర్వాత కూడా సిఎం చంద్రబాబు నాయుడు చాలా సంయమనం పాటిస్తున్నారు. జగన్‌, వైసీపీ నేతలు, వారి మీడియా తనపై ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నా సహిస్తూనే ఉన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే తన భార్య భువనేశ్వరి గురించి చాలా చులకనగా మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని జోలికి నేటికీ వెళ్ళకపోవడమే ఇందుకు చక్కని నిదర్శనం.

వైసీపీ పట్ల ఇంత మెతక వైఖరిని టీడీపి నేతలు, శ్రేయోభిలాషులే జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా సిఎం చంద్రబాబు నాయుడు పద్దతి ప్రకారమే ముందుకు సాగుతున్నారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పద్దతిగా శాసనసభ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చలో పాల్గొనాలని కోరుతున్నారు. కానీ జగన్‌ రావడం లేదు అది వేరే విషయం.

జగన్‌ బయటకు రావాలని కోరుతున్నప్పుడు, ఆయన వస్తుంటే అడ్డుకోవడం లేదా ఆంక్షలు విధించడాన్ని ఎవరూ హర్షించరు.

రేపు (గురువారం) జగన్‌ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని మాకవరపాలెం మండలంలో భీమబోయినపాలెం వరకు రోడ్డు మార్గంలో పర్యటించనున్నారు. కనుక ఇప్పటికే వైసీపీ నేతలు పార్టీ శ్రేణులను సిద్దం చేస్తున్నారు.

ఎప్పటిలాగే అయన వెంట వేలాదిమంది ర్యాలీగా బయలుదేరుతారు. కానీ అంతమందితో విశాఖ స్టీల్ ప్లాంట్‌ మీదుగా వెళ్ళేందుకు అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. అంటే నాడు జగన్‌ ప్రభుత్వం వ్యవహరించినట్లే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

నిజానికి జగన్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తేనే ఆయనకు ఎక్కువ పబ్లిసిటీ దొరుకుతుంది. వైసీపీ కూడా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపి విమర్శించేందుకు అవకాశం లభిస్తుంది.

అదే… జగన్‌ పర్యటనని ప్రభుత్వం పట్టించుకోకపోతే అప్పుడు తనంతంట తాను తప్పులు చేసుకొని లేదా సమస్యలు సృష్టించుకొని ఆయనే చిక్కుల్లో పడతారు. అప్పుడు కూటమి ప్రభుత్వమే ఆయనని విమర్శించగలుగుతుంది.

కానీ ఆయనని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ కూటమి ప్రభుత్వం తీరు కూడా అంతేనని ప్రజలు అనుకునేలా చేస్తోంది. ఇది అవసరమా?

ఇంతకాలం జగన్‌ ప్యాలస్‌ బయటకు రావడం లేదంటూ టీడీపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు వస్తుంటే రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాజకీయంగా ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఆలోచిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories