తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొత్త పార్టీలు పుట్టగొడుగుల మాదిరి పుట్టుకొస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ తో బయటకొచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కుల ప్రాతిపదికన పార్టీ స్థాపించారు.
ఇన్నాళ్ళుగా ప్రాంతీయవాదం ఆధారంగా నడిచిన తెలంగాణ రాజకీయాలకు కుల రాజకీయాలను పరిచయం చేస్తూ తెలంగాణలో బీసీ హక్కుల కోసం “తెలంగాణ రాజ్యాధికార పార్టీ” అంటూ TRP ని స్థాపించి బీసీ రిజర్వేషన్లే మెయిన్ ఎజెండాగా తీసుకున్నారు.
బీసీలకు రాజ్యాధికారం అనే నినాదంతో తెలంగాణ రాజకీయాలలో కొత్త ఒరవడి సృష్టించాలని ఆశపడ్డ తీన్మార్ కు తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ ఓటర్లు పెద్ద జలక్ ఇచ్చారు. కత్తెర గుర్తు పై ఎన్నికల బరిలోకి దిగిన TRP ని తెలంగాణ ఓటర్లు కానీ ఆ ఓటర్ల జాబితాలో ఉన్న బీసీ లు కానీ కనీసం పట్టించుకోలేదు.
కేవలం మా పార్టీకి ఒక్క బీసీ సామాజికవర్గం బలం ఉన్నా చాలు, రాస్తారంలో చక్రం తిప్పేస్తాం, అధికారాన్ని అందిపుచ్చుకుంటాం అంటూ నాడు కుల రాజకీయాలు నడిపిన తీన్మార్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో ఆ బలంతోనే తమ తొలి అడుగుతోనే కనీసం 40 స్థానాలను గెలుచుకుంటాం అంటూ ప్రకటించారు.
అయితే నిన్న విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో TRP ఊసే ఎక్కడ వినిపించలేదు, కనిపించలేదు. ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగమైన JSP సైతం కనీసం 2 వార్డులలోనైనా విజయకేతనం ఎగసిరింది. కానీ నాడు మీడియాలో అంత హంగామా చేసిన తీన్మార్ మల్లన తన పార్టీ తరుపున ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయారు.
ఇక పోటీ చేసిన రెండు స్థానాలు మినహా TRP ఏ ఒక్క చోట కూడా కనీసం డిపాజిట్లను కూడా రాబట్టుకోలేకపోయింది. దీనితో తెలంగాణలో కుల రాజకీయాలకు స్థానం లేదనేది స్పష్టమయింది. మరి ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న తన కుల రాజకీయాలకు స్వస్తి పలుకుతారా.? లేదా కేసీఆర్ మాదిరి అనుకున్నది సాధించేవరకు పోరాడతారా.?




