అమ్మకు అన్నం పెట్టడు పిన్నమ్మకు గాజులు చేయిస్తాడట!

Telangana BJP K Lakshman KCR Vizag Steelవైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకొంటామంటమన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఆ రాష్ట్ర బిజెపి సీనియర్ నేత కె.లక్ష్మణ్ గట్టిగా నిలదీశారు. మంగళవారం హైదరాబాద్‌లో బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పాటు కాగానే రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలన్నిటినీ తిరిగి తెరిపించి అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌, వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయినా ఏ ఒక్కటీ తెరిపించలేకపోయారు కానీ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో నష్టాలలో నడుస్తున్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని కాపాడతారట! ఇదెలా ఉందంటే… అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాన్నట్లుంది!

కేంద్ర ప్రభుత్వం 31 ఖనిజాల హక్కులను ఆయా రాష్ట్రాలకే అప్పగించింది. మరి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని చెప్పిన కేసీఆర్‌ నాలుగేళ్ళయినా ఎందుకు ఏర్పాటు చేయలేదు? తాను ముఖ్యమంత్రినైతే 100 రోజుల్లో నిజాం షుగర్స్ కంపెనీని తెరిపిస్తానన్నారు. ముఖ్యమంత్రి అయ్యి 9 ఏళ్ళు అవుతోంది. కానీ ఎందుకు తెరిపించలేదు?

ADVERTISEMENT

ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే ఆల్విన్, ప్రాగా టూల్స్, డీబిఆర్ మిల్స్, రెయాన్స్ వంటి అనేక భారీ పరిశ్రమలు మూతపడ్డాయి. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో పెట్టాలనుకొంటున్న పెట్టుబడి ఏదో వీటి కోసం ఖర్చు చేసి తెరిపిస్తే తెలంగాణలో వేలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయి కదా? హైదరాబాద్‌లో కోట్లు విలువచేసే ఐడిపిఎల్ భూములు కబ్జాలకు గురవుతుంటే కేసీఆర్‌ పట్టించుకోవడం లేదు. నల్గొండలో భారీగా యురేనియం నిక్షేపాలున్నాయి. వాటిని వెలికితీస్తే దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం కోరితే కేసీఆర్‌ మొండిగా తిరస్కరించారు.

కేసీఆర్‌ ఇతర రాష్ట్రాలను ఉద్దరించే ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దరిస్తే బాగుంటుంది. ఏపీలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించాలనుకొంటున్నారు అందుకే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇది ఏపీ ప్రజలను మభ్యపెట్టి వారి ఓట్లు రాబట్టుకోవడానికే. కానీ ఆంధ్ర ప్రజలు కేసీఆర్‌, కేటీఆర్‌ మాయమాటలకు మోసపోయేంత అమాయకులు కారు,” అని కె.లక్ష్మణ్ అన్నారు.

ADVERTISEMENT
Latest Stories