కేబినెట్ లో మార్పులు …అనివార్యం అయితే అగాధాలేనా.?

Telangana Cabinet reshuffle speculation

తెలంగాణ రాజకీయాలలో రేవంత్ క్యాబినెట్ లో మార్పులు అనివార్యం అంటూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే రెండున్నరేళ్లవుతుంది, ఈ నేపథ్యంలో పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం.

పార్టీ లైన్ దాటి, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేసిన వారి పై వేటు వేయడం అత్యంత అవసరమని, లేదంటే క్యాడర్ లో అసంతృప్తి పెరుగుతుందని, తద్వారా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కష్టమంటూ గుత్తా సుఖేందర్ కీలక వ్యాఖ్యలు చేసారు.

ADVERTISEMENT

అయితే గుత్తా వ్యాఖ్యల వెనుక కొండా కుటుంబ వివాదం దాగుందా.? తాజాగా సీఎం రేవంత్ పైనే కొండా సురేఖ కుమార్తె సుస్మిత బహిరంగ విమర్శలకు దిగారు, అయినా కూడా కొండా కుటుంబం అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని తమకు, తమ కుటుంబానికి గాంధీ కుటుంబం పై ప్రేమ, గౌరవం తో పాటుగా విశ్వాసం కూడా ఉందంటూ కొండా కుటుంబం తమ బీసీ కార్డు ను కూడా ప్రయోగించింది.

ఈ నేపథ్యంలో గుత్తా రేవంత్ కేబినెట్ లో మార్పులు అవసరం అంటూ వ్యాఖ్యానించడంతో బంగారు రాఖీ తో మంత్రి కొండా సురేఖ – సీఎం రేవంత్ మధ్య వివాదం టీ కప్పులో తుఫాన్ మాదిరి ముగిసిపోయింది అనుకున్న కాంగ్రెస్ శ్రేణులకు వివాదం ఇంకా తెరిచిన పుస్తకమే అనే విషయం అవగతం అయ్యింది.

అయితే కొండా కుటుంబం తో పాటుగా చిన్నా రెడ్డి కూడా తన అసమ్మతి గళం వినిపించారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు కేబినెట్ ఏర్పడిన నాటి నుంచి రేవంత్ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా రుసరుసలు విసురుస్తున్న రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం కాచుకుని కూర్చున్నారు.

మరి గుత్తా వ్యాఖ్యలు గమనిస్తే పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా అసమ్మతి స్వరం వినిపించే వారి పై క్రమశిక్షణ వేటు వేసి కేబినెట్ లో కొత్త వారికీ అవకాశం కల్పించాలి అనుకుంటే అప్పుడు ఆ అసమ్మతి స్వరాలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రభుత్వంలో క్యాబినెట్ మార్పులు అనివార్యమయితే ఇక పార్టీ నాయకుల మధ్య అగాధాలే అన్న సంగతి కాంగ్రెస్ లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి అందుకు తగ్గ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం ముందస్తు ప్రణాళికలు వేస్తుందా.? ఒకవేళ వేసినా వాటిని పటిష్టంగా అమలు చేయగలుగుతుందా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే ..!

ADVERTISEMENT
Latest Stories