కవితకు హరీష్, విజయసాయికి సజ్జల విలన్స్… అంతా సేమ్ టూ సేమ్‌!

Vijay Sai Reddy letter on YSRCP and BRS internal politics

ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీలలో చాలా విషయాలలో ఏకత్వం కనిపిస్తుంది. రాజకీయ పార్టీలలో ఇది సహజమే. కానీ చివరికి పార్టీలో అంతర్గత కలహాలు కూడా ఒకే విధంగా ఉండటమే విచిత్రం.

బీఆర్ఎస్‌ పార్టీలో హరీష్‌ రావుని గుంటనక్కతో పోలుస్తుంటారు కల్వకుంట్ల కవిత. ఆయనే తనపై తండ్రికి, అన్నకి చాడీలు చెప్పి పార్టీ నుంచి బయటకు గెంటించేశారని కవిత ఆరోపిస్తుంటారు.

ADVERTISEMENT

ఇక్కడ సజ్జల తనపై జగన్‌కు పిర్యాదులు చేస్తూ పొగ బెట్టి బయటకు వెళ్ళగొట్టారని విజయసాయి రెడ్డి తాజా లేఖలో ఆరోపించారు.

హరీష్‌ రావు కేసీఆర్‌కి శల్యసారధ్యం చేయడం వల్లనే ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ ఓడిపోయిందని కవిత ఆరోపిస్తుంటే, ఇక్కడ సజ్జలశల్యసారధ్యం వల్లనే వైసీపీ ఓడిపోయిందని విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు.

పార్టీ ఓడిపోయినా హరీష్‌ రావుకు తృప్తి కలగలేదని, కేసీఆర్‌, కేటీఆర్‌లను బయటకు గెంటేసి పార్టీని స్వాధీనం చేసుకోవడమో లేదా బిజేపిలో విలీనం చేసేయడమో చేస్తారని కవిత హెచ్చరిస్తుంటారు.

ఇక్కడ వైసీపీ ఓడిన తర్వాత కూడా జగన్‌కి పార్టీ నేతలకు మద్య సజ్జల అడ్డుగోడలా నిలబడుతూ తప్పుదారి పట్టిస్తున్నారని విజయసాయి ఆరోపించారు.

హరీష్‌ రావు తమ కుటుంబంలో చిచ్చుపెట్టి తనని దూరం చేశారని కవిత ఆరోపిస్తుంటే, జగన్‌ కుటుంబంలో సజ్జల చిచ్చుపెట్టి దూరం చేశారని విజయసాయి తాజా లేఖలో ఆరోపించారు.

అక్కడ హరీష్‌ రావు ఆర్‌ఎస్ఎస్, బిజేపి, కాంగ్రెస్‌ పార్టీలతో టచ్‌లో ఉన్నారని కవిత ఆరోపిస్తుంటారు. విజయసాయి తాజా లేఖలో కూడా ఇంచుమించు ఇటువంటి ఆరోపణలే చేశారు.

తాను పార్టీలో ఉన్నప్పుడు హరీష్‌ రావు తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తూ, తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తూ, పార్టీలో ఏకాకిగా మార్చి నిజామాబాద్‌కు పరిమితమయ్యేలా చేశారని, చివరకు బయటకు వెళ్ళగొట్టారని కవిత ఆరోపిస్తుంటారు.

వైసీపీలో సజ్జల కూడా తన పదవులన్నీ ఊడగొట్టి, అవమానించి, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తూ పార్టీలో ఏకాకిగా చేసి చివరకు బయటకు పోయేలా చేశారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

కేసీఆర్‌ ఆరోగ్యం చెడిపోవాలని హరీష్‌ రావు క్షుద్రపూజలు చేస్తున్నారంటూ కవిత ఇటీవల మరో బాంబు పేల్చారు. కానీ సజ్జల అటువంటి ప్రయత్నం చేసినట్లు విజయసాయి ఆరోపించలేదు కానీ పార్టీని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.

అంటే అక్కడ బీఆర్ఎస్‌ పార్టీలో కవిత చెప్తున్న హరీష్‌ రావు పాత్రని ఇక్కడ వైసీపీలో సజ్జల రామకృష్ణా రెడ్డి పోషిస్తున్నారని విజయసాయి రెడ్డి తాజా లేఖతో స్పష్టమయ్యింది.

అక్కడ హరీష్‌ రావు బాధితురాలుగా కవిత కనిపిస్తుంటే, ఇక్కడ సజ్జల బాధితుడిగా విజయసాయిరెడ్డి కనిపిస్తున్నారు.

ఈ కారణంగా పార్టీ వీడిన కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్‌ పార్టీ పెట్టుకుంటే, విజయసాయి రెడ్డి కూడా త్వరలో కొత్త పార్టీ పెట్టుకోబోతున్నారు.

వేర్వేరు రాష్ట్రాలలోని రెండు పార్టీల మద్య మరీ ఇంత సారూప్యతలు ఉండటం ఆశ్చర్యకరమే కదా?

ADVERTISEMENT
Latest Stories