“తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025” పేరుతో హైద్రాబాద్ సమీపంలోని ఫ్యూచర్ సిటీ లో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ దశ దిశను మార్చనుందా.? ముఖ్యమంత్రిగా రేవంత్ ఈ సమ్మిట్ ఏర్పాటుతో పాలనలో తనదైన మార్క్ వేయబోతున్నారా.?
తెలంగాణ రైసింగ్ 2047 విజన్ తో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ ముఖ్య లక్ష్యం తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా, ఇన్వెషన్ సెంటర్ గా ప్రపంచానికి పరిచయం చేయడం. అయితే ఈ రోజు, రేపు జరగబోయే ఈ ప్రతిష్టాత్మక సమేవేశాలకు దేశ విదేశాల నుండి ఇన్వెస్టర్లు హాజరవుతున్నారు.
సుమారు 80 ఎకరాల విస్తీర్ణం లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమ్మిట్ కు 44 దేశాల నుండి దాదాపు 154 మంది అంతర్జాతీయ అతిధులతో పాటు 2000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
అయితే ఆ వచ్చిన అతిధులను ఆకర్షించేందు గాను తెలంగాణ సాంప్రదాయ వంటకాలను సిద్ధం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ అందుకు తగ్గ ఏర్పాట్లు చేసారు.
రేవంత్ తన తొలి ముఖ్యమంత్రి అనుభవం లోనే తెలంగాణ ఆర్థిక ప్రగతికి, సామజిక గుర్తింపుకి, తన ఫ్యూచర్ సిటీ కలల సౌధం నిర్మాణానికి గ్లోబల్ సమ్మిట్ ని ఆయుధంగా మార్చుకోనున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరోలెక్క అన్న చందంగా ఈ గ్లోబల్ సమ్మిట్ ను ప్రచారం చేస్తుంది రేవంత్ సర్కార్.
గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటుతో ప్రపంచ దేశాలలో హైద్రాబాద్ బ్రాండ్ వాల్యూ ని రెట్టింపు చేసి తెలంగాణలో రేవంత్ తనదైన ముద్ర వేయవున్నారు. గతంలో 2020 విజన్ తో చంద్రబాబు హైద్రాబాద్ అభివృద్ధికి భీజం వేస్తె ఇప్పుడు రేవంత్ 2047 విజన్ తో తెలంగాణ భవిష్యత్ కి పునాదులు తవ్వుతున్నారు.
అయితే ఇటు బీజేపీ సైతం కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం గ్లోబల్ సమ్మిట్ కు గాను తెలంగాణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమ్మిట్ తెలంగాణ అభివృద్ధి, పురోగతి కి వేదిక కావాలంటూ ఆకాంక్షించారు.






