ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శమని సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్ని గొప్పలు చెప్పుకొంటున్నా వాస్తవ పరిస్థితులు ఏమిటో వారితో సహా అందరికీ తెలుసు. అందుకే కేంద్రమంత్రులు, తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేలెత్తి చూపి మాట్లాడుతున్నారు. మన బంగారం స్వచ్ఛమైనది కానప్పుడు కంసాలిని నిందించి ఏం ప్రయోజనం అన్నట్లు, లోపం మనలో ఉంచుకొని ఎవరో వేలెత్తి చూపారని ఉక్రోషపడటం కూడా అనవసరమే.
ఇంతకీ విషయం ఏమిటంటే, తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌రావు మంగళవారం సంగారెడ్డి పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రా నుంచి వచ్చిన మేస్త్రులు, కార్మికులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మీరందరూ పండుగలకి, పబ్బాలకి ఆంధ్రాలో మీ ఊళ్ళకు వెళ్ళి వస్తుంటారు. అక్కడ రోడ్లు, ఆసుపత్రులు వగైరా ఎంత అధ్వానంగా ఉన్నాయో మీరూ చూసే ఉంటారు. ఇక్కడ ఎలా ఉన్నాయో కూడా చూస్తున్నారు. ఆంధ్రాకి, తెలంగాణ రాష్ట్రానికి మద్య భూమికి ఆకాశానికి మద్య ఉన్నంత తేడా ఉంది. మీరు ఇంకా ఏపీలో ఉండాలని ఎందుకు అనుకొంటున్నారు? అక్కడ మీ ఓటు హక్కుని రద్దు చేసుకొని ఇక్కడ నమోదు చేసుకోండి. ఇక్కడకు శాశ్వితంగా వచ్చేయండి. తెలంగాణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న మీరందరూ మావాళ్ళే. తెలంగాణ కోసం చెమట చిందించే ప్రతీ ఒక్కరూ తెలంగాణ బిడ్డలే. మీరు ఆంధ్రా, తెలంగాణ అంటూ రెండు పడవలలో కాళ్ళు పెట్టి ప్రయాణించకుండా ఇక్కడే తెలంగాణలో హాయిగా జీవించండి. మీ అందరి కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పధకాలను అమలుచేస్తుంది,” అని అన్నారు.
మంత్రి హరీష్ రావు ఏపీలో నెలకొన్న వాస్తవ పరిస్థితుల గురించే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధిలో తెలంగాణతో ఏపీ పోటీ పడింది. కానీ ఇప్పుడు పూర్తిగా వెనకబడిపోయిందని, దానికి కారణాలు కూడా అందరికీ తెలుసు.
ఏపీ నుంచి ఎటువంటి పోటీ లేకపోవడం, తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం పట్టుదలతో కృషి చేయడం వలననే ఈ 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది, ఏపీకి అందనంత ఎత్తులో నిలిచిందనేది వాస్తవం. ఇందుకు మంత్రి హరీష్ రావును తప్పు పట్టలేము.
కానీ రాష్ట్ర విభజనతో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని గద్దె దించి, అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోయేలా చేసి ఏపీని ఈ దుస్థితికి తీసుకువచ్చింది కేసీఆరే అని చెప్పక తప్పదు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీకి మళ్ళీ అధికారంలోకి రావడమే ముఖ్యం అని భావిస్తోంది తప్ప ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేసుకోవాలనుకోలేదు. కనుక ఏపీ వెనుకబాటుకి కేసీఆర్‌ని నిందిస్తూ మన అసమర్దతని, వైఫల్యాలన్ని దాచి పెట్టుకోవాలనుకోవడం కూడా సబ్బబు కాదనే చెప్పాలి.
అయితే ఒకప్పుడు హైదరాబాద్‌లో ఆంద్రా వాళ్ళని తరిమి తరిమి కొట్టాలన్న బిఆర్ఎస్ నేతలకు ఇప్పుడు హటాత్తుగా ఆంధ్రాపై ఇంత ప్రేమ ఎందుకు పొంగిపొర్లుతోందో కూడా అందరికీ తెలుసు. 1. ఏపీలో బిఆర్ఎస్ పార్టీ విస్తరణ. 2. ఎన్నికలలో సీట్లు గెలుచుకోవడం. 3. తెలంగాణలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో ఆ రాష్ట్రంలోస్థిరపడిన ఆంధ్రా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం. 4. ఈవిదంగా మళ్ళీ బిఆర్ఎస్-వైసీపీ మంత్రులు, నేతల మద్య విమర్శలు, ఆరోపణలు చేసుకొంటూ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం. 5. ఏపీలో వైసీపీకి పరోక్షంగా మళ్ళీ తోడ్పడటం.
ఒకవేళ ఆంద్రా వెనకబడిపోయిందని కేసీఆర్ నిజంగా ఆవేదన చెందుతున్నట్లయితే, ఏపీలో కార్మికులను ఓటు హక్కు రద్దు చేసుకొని రమ్మనమని చెప్పే బదులు, మళ్ళీ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలను విలీనం చేసేస్తే సరిపోతుంది కదా?అప్పుడు ఆయనకు మరిన్ని ఓట్లు, సీట్లు, బలం పెరుగుతుంది కూడా. తెలంగాణను అభివృద్ధి చేసిన్నట్లే ఆంధ్రాను కూడా అభివృద్ధి చేసి చూపించవచ్చు కదా?



