రాజకీయ పార్టీల తిప్పలు…తప్పదుగా..

Telangana municipal elections trigger camp politics drama

ఎన్నికలు అనే పేరు వినిపించగానే రాజకీయ పార్టీల తిప్పలు అన్ని ఇన్ని కావనే చెప్పాలి. ఎన్నికల ప్రచారంతో మొదలైయ్యే వీరి పాట్లు ఇక అక్కడి నుంచి ఓటర్లను తమ వైపు ఆకర్షించుకోవడానికి ప్రకటించే ఉచిత పథకాలు అంటూ మైకుల ముందు నడిచే రాజకీయం ఒకవైపు,

ఇక ఫ్రీ గిఫ్టులు, ఓటుకి నోటు అంటూ తెరవెనుక నడిచే పంచాయితీలు మరోవైపు సాగుతూవుంటాయి. అయితే ఇక్కడితో వీరి పాట్లు ముగిసినట్టే అనుకుంటే పోలింగ్ బూత్ లో చెయ్యి పెట్టినట్టే. ఎన్నికల ప్రచారంతో మొదలయ్యె ఈ హంగామా ఎన్నికల ఫలితాల వరకు నిర్విరామంగా కొనసాగుతుంది.

ADVERTISEMENT

సార్వత్రిక ఎన్నికల కంటే కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ హంగామా ఇంకాస్త శృతిమించి ఉంటుంది. తాజాగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల విడుదల తరువాత అక్కడ చోటు చేసుకున్న పరిస్థితులు, జరుగుతున్న పొలిటికల్ డ్రామాలు, ఆయా పార్టీల నేతలు చేస్తున్న హంగామాలు చూస్తే విషయం పూర్తి స్పష్టంగా తెలుస్తుంది.

116 మున్సిపాలిటీల చైర్ పర్సన్స్, వైస్ చైర్ పర్సన్స్, 7 కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల గాను నేడు ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ అటు ప్రతిపక్ష బిఆర్ఎస్, బీజేపీ లపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ కొన్ని స్థానాలలో హంగ్ ఏర్పడే పరిస్థితి ఉండడంతో ఇక అన్ని పార్టీల నేతలు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు.

దీనితో మా పార్టీ నేతలను ఇతర పార్టీల నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు అంటూ కొందరు, మా పార్టీ నేతలను బలవంతంగా ఆ పార్టీలో చేర్చుకుంటున్నారు అంటూ మరికొందరు, మా పార్టీలో గెలిచిన అభ్యర్థులను కిడ్నాప్ చేస్తున్నారు అంటూ మరికొందరు,

ఇలా ఎన్నికల ముందు ఓటర్లను ప్రలోభ పెట్టిన రాజకీయ పార్టీలు ఆయా పార్టీల నేతలు ఇప్పుడు ఎన్నికల ఫలితాల తరువాత ప్రత్యర్థి పార్టీల నేతలను, ఇండిపెండెంట్ క్యాండేట్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

హంగ్ ఏర్పడే అవకాశం ఉన్న 37 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ స్థానంలోనూ మూడు పార్టీలు తమ తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ తమ గెలుపు కంటే కూడా ప్రత్యర్థి ఓటమి కోసం పావులు కదుపుతున్నాయి.

తమ పార్టీ ఆధిపత్యం కోసం ప్రత్యర్థి పార్టీల నేతలకు, స్వతంత్ర అభ్యర్థులకు హైద్రాబాద్ లో ఫ్లాట్లు, ఖరీదైన కార్లు, భారీగా నగదు, బంగారం ఆఫర్ల రూపంలో అభ్యర్థుల ముందు ప్రలోభాల చిట్టా పొద్దు ఉంచుతున్నారు.

ఇందుకోసం ఉప్పు – నిప్పు గా కొట్టుకునే కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒక్కటయ్యాయి. కామారెడ్డి మున్సిపాలిటీ లో బీజేపీ కి చెక్ పెట్టేందుకు అధికార – ప్రతిపక్షాలు చేతులు కలిపాయంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీకి గాను కాంగ్రెస్ -19, బిఆర్ఎస్ -11, బీజేపీ -16 స్థానాలలో గెలుపొందగా, స్వతంత్రులు -3 స్థానాలను కైవసం చేసుకున్నారు.

దీనితో ఇక్కడ బీజేపీ కి అధికార పీఠం దక్కకుండా చేయడానికి గులాబీ కారు, కాంగ్రెస్ హస్తం లోపాయకారి ఒప్పందానికి వచ్చినట్టు సమాచారం.

నాడు తమ గెలుపు కోసం ఓటర్లకు పంచిన తాయిలాలు నేడు తన పార్టీ ఆధిపత్యం కోసం నాయకులకు ముందుంచుతున్న ప్రలోభాలు చూస్తే రాజకీయాలు ఎంత కాస్టలీ గా మారిపోయాయో, అవి సామాన్యుడికి అందనంత ఎత్తుకి ఎలా వెళ్ళిపోతున్నాయో అర్ధమవుతుంది.

ADVERTISEMENT
Latest Stories