ఎన్నికలు మన ప్రజాస్వామ్యానికి నిదర్శనం… ఇది రాజకీయనాయకులు జనాలకు చెప్పే కొటేషన్! కానీ ఎన్నికలంటే ప్రచారం, వ్యూహాలు, డబ్బు, ప్రలోభాలు…. ఇలా చాలానే ఉన్నాయని ప్రతీ ఒక్కరికీ తెలుసు. అయినప్పటికీ ఎన్నికలలో జయాపజయాలే ఓ నాయకుడు లేదా ఓ పార్టీ లేదా ఓ ప్రభుత్వ సమర్దతకు కొలమానంగా భావిస్తుంటాము.
కనుక తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో విజేత కాంగ్రెస్ పార్టీ… ప్రభుత్వమే! వాటిని గెలిపించుకున్న సిఎం రేవంత్ రెడ్డి సమర్దతకు, నాయకత్వానికి ఈ విజయం ఓ తాజా కొలమానం.
పోటీలో ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోతారు. కనుక ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ, దానిని ముందుండి నడిపిస్తున్న కేటీఆర్, హరీష్ రావుల నాయకత్వం ప్రశ్నార్ధకంగా మారింది. సాక్షాత్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వారిరువురూ ఫెయిల్… అట్టర్ ఫ్లాప్ అని సర్టిఫై రెండు ముక్కలో తీసి పడేశారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పదేళ్ళపాటు కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరూ ఓడించలేకపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి బాహుబలిలా ప్రవేశించి పదేళ్ళ కేసీఆర్ పాలనని అంతం చేశారు. నేటికీ దెబ్బ మీద దెబ్బ తీస్తూనే ఉన్నారు.
కేసీఆర్ అంతటివాడిని ఓడించినప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆయన పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆయన తమ స్థాయికి మించిన రాజకీయ నాయకుడని గుర్తించాలి. కానీ అంగీకరించలేక ఎదుర్కోలేక, ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నారు.
అయినా సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి కేటీఆర్ చాలా చులకనగా మాట్లాడుతున్నారు. ఇది ఓటమి తాలూకు ఫ్రస్ట్రేషన్ అని కొట్టిపడేయడానికి లేదు. అహంభావంతో మాట్లాడుతున్న మాటలుగానే చూడాల్సి ఉంటుంది.
ఇలాంటి సమయంలో ప్రజల తీర్పు గౌరవిస్తున్నాము… ఆత్మవిమర్శ చేసుకుంటాము… వంటి రొటీన్ డైలాగ్స్ చెప్పి సులువుగా బయటపడవచ్చు.
అసూయ, ద్వేషం, బేషజాలు పక్కన పెట్టగలిగితే సిఎం రేవంత్ రెడ్డి ఎదుగుదలని, ఆయన చేతిలో తమ ఓటములను విశ్లేషించుకొని కేటీఆర్ తన నాయకత్వ లక్షణాలు పెంచుకోవచ్చు కూడా.
కానీ నేటికీ సిఎం రేవంత్ రెడ్డిని దూషిస్తున్నారు. చులకనగా మాట్లాడుతున్నారు. తక్కువ అంచనా వేస్తున్నారు. కనుక భవిష్యత్, ఫలితాలు, పర్యవసనాలు కూడా ఇలాగే పునరావృతం అవుతూనే ఉండవచ్చు.






