రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు కావస్తోంది. దానిలో కూటమి ప్రభుత్వం 7 ఏళ్ళు, వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించాయి.
రెండు ప్రభుత్వాలు విశాఖ పేరుతోనే రాజకీయాలు చేశాయి. విశాఖ భజనే చేశాయి. కానీ విశాఖ రోడ్ల పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది.
విశాఖ రాజధాని చేస్తానన్న వైసీపీ ప్రభుత్వం, ఆర్ధిక, ఐటి రాజధాని చేస్తామంటున్న కూటమి ప్రభుత్వం రెండూ కూడా ముందుగా నగరాభివృద్ధి చేయాలనుకోలేదు. ముఖ్యంగా రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణ విషయంలో రెండు ప్రభుత్వాలు ఒకేలా వ్యవహరించాయని చెప్పక తప్పదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు వేగవంతం చేసింది. విశాఖకు పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు రప్పిస్తోంది. కనుక విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్ ఐటి, ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చెందబోతోందని అర్ధమవుతోంది.
కానీ ఇవన్నీ వచ్చేసరికి పెరిగే జనాభా, ట్రాఫిక్‌కి విశాఖలో ఉన్న రోడ్లు సరిపోవు కదా?కనుక ఆలోగా యుద్ధ ప్రాతిపదికన ఎక్కడికక్కడ ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించాలి కదా?
కానీ ఒక్కటీ నిర్మించలేదు. ఏమంటే అన్నిటికీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రెడీమేడ్ సమాధానం చెపుతుంటారు.
విశాఖకు మెట్రో ఓ వరం అని అందరూ అనుకున్నారు. కానీ అదే ఇప్పుడు శాపంగా మారింది.
ఫ్లై ఓవర్, మెట్రో కారిడార్ కలిపి డబుల్ డెక్కర్ విధానంలో నిర్మిస్తే ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వం భావించింది. ఇది ఏడాదిన్నర క్రితం ఆలోచన. ఈ ఆలోచనే నగరంలో కొత్త ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అవరోధంగా మారింది.
మెట్రోకి ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకొని, డబ్బు సమకూర్చుకొని, సన్నాహాలు చేసుకునేలోగా భోగాపురం విమానశ్రయం నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. జూన్‌లో ప్రారంభం కాబోతోంది.
అది మొదలైతే విశాఖలో ట్రాఫిక్ ఒకేసారి పెరిగిపోతుంది. ఈలోగా ఐటి కంపెనీలు రెడీ అయితే మరో లక్ష మంది ఉద్యోగులు, కార్లు, బైకులు వేసుకొని రోడ్లపైకి వచ్చేస్తారు. అప్పుడు విమాన ప్రయాణికులు, ఐటి ఉద్యోగులతో పాటు నగర ప్రజలు కూడా ప్రతీరోజూ రోడ్లపై నరకం అనుభవించక తప్పదు.
ఈ మాట అన్నది ఎవరో కాదు… మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. కనుక యుద్ధప్రాతిపాదికన విశాఖలో ఫ్లై ఓవర్లు, కొత్త రోడ్లు నిర్మించాలని నిన్న శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు.
కనుక ప్రభుత్వం ఇంకా మెట్రో మెట్రో అంటూ భజన చేస్తూ కూర్చుంటే, ఆ తర్వాత మెట్రో నిర్మించేందుకు రోడ్లు ఖాళీగా లభించవు. రోడ్లపై రద్దీ మూడింతలు పెరిగిపోయిన తర్వాత డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించాలనుకుంటే అంతకంటే అవివేకం ఉండదు. కనుక ఇప్పటికైనా ఎమ్మెల్యే శ్రీనివాసరావు కొట్టిన గంటతో మేల్కొంటే మంచిది.




