ఈ మాట అన్నది ఏపీ బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఎవరిని ఉద్దేశ్యించి అంటే… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి! తెలంగాణ లో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా కేసీఆర్ అద్భుతంగా తెలంగాణ సెంటిమెంట్ పండించి విజయం సాధిస్తుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే అందరికీ తెలిసిన కారణాల వలన కేసీఆర్ తన బిఆర్ఎస్ పార్టీతో ఏపీలో అడుగుపెట్టడానికి ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. కనుక ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టి దానిని కాపాడుతానంటూ, ఉత్తరాంద్ర ప్రజల సెంటిమెంట్ క్యాష్ చేసుకోవడానికి కేసీఆర్ వస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 2024 ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల కోసమే కేసీఆర్ ఈ కొత్త డ్రామా మొదలుపెట్టబోతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
“అమ్మకు అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్లు సింగరేణితో కలిసి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతానని నాలుగేళ్ళ క్రితం కోతలు కోసిన కేసీఆర్, ఇప్పుడు అదే సింగరేణితో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడతానని కొత్త నాటకం మొదలుపెట్టారని” విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
“మొన్న సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆందోళనలు చేశారు. ఇవాళ్ళ అదే సింగరేణితో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనిపిస్తామని ప్రగల్భాలు! నర్సీ…. ఇలా అయితే దొరికిపోతామని మీకెవరూ చెప్పలేదా? లేక ప్రజలను పిచ్చోళ్ళనుకొంటున్నావా?” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
విష్ణువర్ధన్ రెడ్డి చెప్పిన్నట్లు, కేసీఆర్ ముందుగా వేలంపాటలో సింగరేణి గనులను దక్కించుకొనే ప్రయత్నం చేయాలి. కానీ అలా చేయకుండా ఆందోళనలు చేయిస్తున్నారు. ఎందుకంటే సింగరేణికి మరో 100-200 సంవత్సరాలకు సరిపడా బొగ్గు గనులు ఉన్నాయి. కనుక బొగ్గు గనుల ప్రయివేటీకరణ అంశాన్ని బిఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకొంటున్నట్లు భావించవచ్చు.
అదే… వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయానికి వచ్చేసరికి దానిని కాపాడాలని కేసీఆర్ నిర్ణయించుకొన్నారు. దేనికో ముందే చెప్పుకొన్నాము. కనుక సింగరేణి గనులు విషయంలో ఒకలాగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మరోలాగ వ్యవహరిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పినది వాస్తవమే అని అర్దం అవుతోంది.
మొన్న : సింగరేణిని మోదీ ప్రైవేటుపరం చేస్తున్నారని ఆందోళనలు !
ఇవాళ : సింగరేణితో విశాఖ స్టీల్ ప్లాంట్నే కొనిస్తామని ప్రగల్భాలు !
నర్సీ … ఇలా అయితే దొరికిపోతామని మీకేవరూ చెప్పలేదా ? లేక ప్రజలను పిచ్చోళ్లనుకుంటున్నారా ?@TelanganaCMO @KTRBRS #Telangana #AndhraPradesh https://t.co/OEMz4qTxWl pic.twitter.com/TqZ0n0OCAj
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) April 10, 2023



