వైసీపీ ప్రభుత్వానికి ఏదో ఓ సమస్య సృష్టించడం, దాంతో కొన్ని రోజులు కాలక్షేపం చేయడం తర్వాత మరో సమస్యని సృష్టించడం పరిపాటిగా మారిపోయిందని చెప్పవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ రంగులు, సంస్థల పేర్లు మార్పు, పాఠశాలల విలీనం, ఉపాధ్యాయులకు మొబైల్ హాజరు, జీతాల చెల్లింపులో ప్రతీనెల ఆలస్యం, జీవో నంబర్:1, ఋషికొండ తవ్వకాలు, దానిపై నిర్మాణాలు, మూడు రాజధానుల పేరుతో మంత్రులు ఎమ్మెల్యేలే ఆందోళనలు చేయడం, టిడిపి కార్యాలయాలపై దాడులు… ఇలా చెప్పుకొంటూపోతే చాలానే ఉన్నాయి.
వీటితోనే మూడున్నరేళ్ళ పుణ్యకాలం పూర్తయిపోయింది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. మరో ఆరు నెలల్లో పూర్తిగా ఎన్నికల హడావుడి మొదలైపోతుంది. కనుక ఈ మిగిలిన ఈ కొద్దిపాటి సమయంలో వైసీపీ ప్రభుత్వం చేయగలిగేదేమి ఉండకపోవచ్చు. అయితే మార్చి 2,3 తేదీలలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగబోతున్నందున ఆలోగా సుప్రీంకోర్టు చేత మూడు రాజధానులపై మమ అనిపించేసుకొని పరువు కాపాడుకోవాలని వైసీపీ ప్రభుత్వం ఎంత ఆదుర్ద పడినా డామిట్! కధ మళ్ళీ అడ్డం తిరిగింది.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి ఇంకా రెండు రోజులే సమయం ఉంది. కానీ సుప్రీంకోర్టు ఈ కేసు విచారణని మరోసారి వాయిదా వేసింది. ఫిభ్రవరి 23న విచారణ చేపట్టవలసి ఉండగా దానిని మార్చి 28కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇది వైసీపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఎందుకంటే ఢిల్లీ సదస్సులో సిఎం జగన్మోహన్ రెడ్డి తాను త్వరలో విశాఖకి షిఫ్ట్ అయిపోతున్నానని చెప్పుకొన్నారు. అంటే ఏపీ రాజధాని విశాఖపట్నమే అని వారిని నమ్మించే ప్రయత్నంగా భావించవచ్చు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసు విచారణని ఏకంగా మార్చి 28కి వాయిదా వేయడంతో ఏపీలో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేయడానికి ఉరుకులు పరుగులు మీద విశాఖకి వస్తున్న పారిశ్రామికవేత్తలకి ఏమని సమాధానం చెప్పుకోవాలి?మళ్ళీ కోడి… గుడ్డు అంటూ మరో పిట్ట కధ అల్లి చెప్పుకోవాలి. అయితే సంక్షేమ పధకాలతో ఓటర్లని ప్రలోభపెట్టవచ్చు కానీ కోడు… గుడ్డు.. ఆమ్లెట్ అంటూ పెట్టుబడిదారులని మభ్యపెట్టడం సాధ్యమేనా?
అయినా రాజధానికి… పరిశ్రమలు, పెట్టుబడులకి ఎటువంటి కనెక్షన్ లేదని ఓ మంత్రిగారు సెలవిచ్చారు. మరో మంత్రిగారు “జస్ట్ ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి చాలు… గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో వేల ఉద్యోగాలు వచ్చేస్తాయని జోస్యం చెప్పారు. కనుక ఏపీకి రాజధాని లేకపోయినా, విశాఖ రాజధాని కాకపోయినా లక్షల కోట్లు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చేస్తాయని ఎదురుచూడక తప్పదు.



