స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో తెలంగాణకున్న శ్రద్ద వైసీపీ ప్రభుత్వానికి లేదే!

Vizag_Steel_Gudivada_Amarnathవైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తున్నట్లు వచ్చిన వార్తలపై రాష్ట్ర పరిశ్రమలశాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందన చూసినప్పుడు, తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నపాటి ఆలోచన, ముందుచూపు, శ్రద్ద వైసీపీ ప్రభుత్వానికి లేవా?అని సందేహం, బాధ కలుగుతుంది.

మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో పర్యటించినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ చేయవద్దనేది మా ప్రభుత్వ వైఖరిగా ఉంది. అలాంటప్పుడు పొరుగు ప్రభుత్వం ప్లాంట్‌ని కొనుగోలుచేస్తుంటే, ఏపీ ప్రభుత్వమే కొనుగోలు చేయొచ్చు కదా?అని మమ్మల్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది.

ADVERTISEMENT

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని ప్రైవేటీకరించవద్దని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి వ్రాసి, ఇప్పుడు ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టి కొనుగోలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇది ప్లాంట్‌ని అమ్మేయమని కేంద్రాన్ని ప్రోత్సహిస్తున్నట్లే కదా?అయినా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో పెట్టుబడి పెడతామని బిఆర్ఎస్‌ పార్టీ కానీ తెలంగాణ ప్రభుత్వం గానీ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. కనుక మీడియాలో వస్తున్న ఈ గాలివార్తలపై మేము స్పందించనవసరం లేదు. ఒకవేళ బిఆర్ఎస్‌ పార్టీ లేదా తెలంగాణ ప్రభుత్వం ప్లాంట్‌లో పెట్టుబడి పెడతామని అధికారికంగా ప్రకటిస్తే అప్పుడు మేము స్పందిస్తాము. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు మేము వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేస్తున్నాను,” అని అన్నారు.

ఓ వైపు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి బిడ్స్ ఆహ్వానిస్తుంటే, ‘ప్లాంట్‌ ప్రయివేటీకరణకు మేము వ్యతిరేకం,’ అంటూ మంత్రి చేతులు దులుపుకోవడం విస్మయం కలిగిస్తుంది. ఆనాడు చకాచకా ఏపీ రాష్ట్ర విభజన జరిగిపోతున్నప్పుడు…. ఏపీ రెండు ముక్కలయ్యేవరకు అన్ని పార్టీలు ఇలాగే వ్యవహరించాయి. ఇప్పుడు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం జరిగిపోతున్నప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తోంది.

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో తెలంగాణ ప్రభుత్వమే పెట్టుబడి పెట్టినా, ఆదానీ పెట్టుబడి పెట్టినా ప్లాంట్‌ వారి చేతుల్లోకే వెళ్ళిపోతుంది కనుక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే దానిని కోల్పోతుంది. దానిలో పెట్టుబడి పెట్టి నడిపిస్తే అన్ని విదాల లాభం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నప్పుడు, ఏపీ ప్రభుత్వం పెట్టినా అదే లాభం, రాజకీయ ప్రయోజనం ఉంటుంది కదా?వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కళ్ళ ముందే అమ్ముడైపోతుంటే, ఆ అమ్మకాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ప్రజలను మభ్యపెడుతూ, మరో పక్క కడపలో వేలకోట్లు పెట్టుబడితో కొత్తగా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం వివేకమనిపించుకొంటుందా?

అయినా ఉద్యోగులకు నెలనెలా సకాలంలో జీతాలే చెల్లించలేని దుస్థితిలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో వేలకోట్లు పెట్టుబడి ఎలా పెట్టగలదు? వెర్రి ఆలోచన కాకపోతే!

ADVERTISEMENT
Latest Stories