సీబీఐ కేసులు… ఏపీలో ఓ లెక్క.. తెలంగాణలో మరో లెక్క?

YS_Avinash_Reddy_Magunta_SreenivasulaReddyఢిల్లీ లిక్కర్ స్కామ్‌, వివేకానంద రెడ్డి హత్య కేసులపై సీబీఐ విచారణ వేగవంతం అవుతున్నకొద్దీ వాటితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబందం ఉన్నవారు తీవ్ర ఆందోళన చెందడం సహజం. అయితే సీబీఐ విచారణపై తెలంగాణలో బిఆర్ఎస్‌ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తుంటే, ఏపీలో వైసీపీ నేతలు టిడిపిని నిందిస్తుండటం విశేషం.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత కీలకపాత్ర వహించారని ఆరోపిస్తూ సీబీఐ అధికారులు ఆమెకి ఓసారి నోటీసులు ఇచ్చి హైదరాబాద్‌లో ప్రశ్నించారు కూడా. గతంలో ఆమెకి ఆడిటింగ్ చేసిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుని ఈ కేసులో నిందితుగా పేర్కొంటూ సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది కూడా. ఇదే కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని కూడా మొన్నే సీబీఐ అరెస్ట్ చేసింది.

ADVERTISEMENT

ఈ కేసు విచారణ, అరెస్టులపై తెలంగాణ సిఎం కేసీఆర్‌ స్పందిస్తూ, “మోడీ-అదానీల బందంపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు సిసోడియాని అరెస్ట్ చేశారని ట్వీట్‌ చేశారు. ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐ‌టిలని వేటకుక్కలా తన ప్రత్యర్ధులపైకి ఉసిగొల్పి భయబ్రాంతులని చేసి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తోంది,” అని ఆరోపించారు.

తెలంగాణలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐ‌టి, ఈడీ, సీబీఐ దాడులు జరిగినప్పుడు అందరూ ధైర్యంగా కేంద్రాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. నలుగురు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి బిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించినప్పుడు, కేసీఆర్‌ ఏ మాత్రం సంకోచించకుండా ఆ ముగ్గురు బిజెపి ప్రతినిధులని వలేసి పట్టుకొని జైలుకి పంపించారు కూడా. ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించుతానని కేసీఆర్‌ శపధం చేస్తున్నారు కూడా!

అయితే ఏపీలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. అక్రమాస్తుల కేసులో జగన్‌, విజయసాయి రెడ్డి తదితరులని అన్యాయంగా ఇరికించారంటూ వైసీపీ నేతలు అధికారంలో లేని కాంగ్రెస్‌, టిడిపిలని నిందిస్తుంటారు. ఆ కేసుల కోసం నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతున్నా ఏనాడూ ఎవరూ కూడా కేంద్రాన్ని, సీబీఐని బహిరంగంగా నిలదీసిన దాఖలాలు లేవు.

వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని సీబీఐ చెపితే ఆయన నిర్ధోషి అని సజ్జల రామకృష్ణారెడ్డి క్లీన్ చిట్ ఇచ్చేసి, ఈ కేసుకి చంద్రబాబు నాయుడే బాధ్యుడని వితండవాదం చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రధాన సూత్రధారి అని సీబీఐ చెపుతూ, ఆయన కుమారుడు రాఘవ రెడ్డిని అరెస్ట్ చేస్తే వారికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే వారినీ చంద్రబాబు నాయుడే ఇరికించారని ఆరోపించనందుకు సంతోషించాలేమో?

తెలంగాణ మంత్రులు కేంద్రాన్ని వేలెత్తిచూపి విమర్శిస్తుంటే, ఏపీలో మంత్రులు కేంద్రాన్ని వేలెత్తి చూపలేక అన్నిటికీ చంద్రబాబు నాయుడిని నిందిస్తున్నారు…. ఎందుకు?అంటే కేంద్రాన్ని నిందిస్తే ఏమవుతుందో వారికీ తెలుసు. కనుక ఈ కుట్రలన్నీ చంద్రబాబు నాయుడే చేశారని పదేపదే గట్టిగా వాదిస్తూ ఆయన ఇమేజ్‌ని డేమేజ్ చేయవచ్చని భావిస్తున్నారేమో?అయితే వైసీపీ నేతలు ఎంతగట్టిగా వాదించినా, ఏదో ఓ రోజు నిందితులు అందరూ జైలుకి వెళ్ళక తప్పదు కనుక అప్పుడు ప్రజలే గ్రహిస్తారు.

ADVERTISEMENT
Latest Stories