ఒకప్పుడు ఏపీ రాజకీయాలలో ఓ పద్దతి కనిపించేది. కేవలం ఎన్నికల సమయంలో నేతలు ప్రత్యర్ధులని విమర్శించడం, పార్టీలు మారడం, గెలుపు కోసం హామీలు ఇవ్వడం వంటివి చేస్తుండేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు ఎంత పతనావస్థకి వెళ్ళిపోయాయంటే 365 రోజులు విమర్శలు, రాజకీయ వేధింపులు, భౌతిక దాడులు కొనసాగుతున్నాయి. అధికారంలోకి రాగానే పరిపాలనకి పూర్తి సమయం కేటాయించవలసి ఉండగా, రాజకీయ ప్రత్యర్ధులని ఏవిదంగా అణచివేయాలనే ఆలోచనలతోనే పాలకులు బిజీగా ఉంటున్నారు.
ఈ ధోరణితో విసుగెత్తిపోయిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడు పదిమంది అనుచరులని వెంటబెట్టుకొని రోడ్లపై దాదాగిరీ చేయడమే రాజకీయంగా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్ధులని వేధించడం, రౌడీయిజం చెలాయించడం నాకు చేతకాదు. అందుకే పార్టీలో, రాజకీయాలలో కూడా వెనుకబడిపోయాను,” అని అన్నారు.
వైసీపీ నేతల తీరుకి అద్దం పట్టిన్నట్లున్న ఆయన చెప్పిన ఈ మాటలు విన్నప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో అర్దం చేసుకోవచ్చు. మొన్న గన్నవరంలో వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు టిడిపి కార్యాలయంపై దాడులు, ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభితో సహా పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేయడం, యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ని అడ్డుకొనే ప్రయత్నం చేయడం, ఆయన చేతిలో మైక్ లాక్కోవడం, చంద్రబాబు నాయుడు రోడ్ షోని అడ్డుకొని ఆయన ప్రసంగిస్తుండగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటివాటిని ప్రజాస్వామ్యవాదులు ఎవరూ హర్షించలేరు.
పాలకుల ఈ విపరీత ధోరణిని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కానీ సంక్షేమ పధకాల వలలో ఓటర్లందరినీ ఒడిసి పట్టేసుకొన్నామనే ధీమాతో వైసీపీ నేతలున్నట్లున్నారు. అందుకే ఇంతగా రెచ్చిపోతున్నారేమో?అయితే ఈ విపరీత ధోరణి, విపరీత పోకడల వలన వైసీపీ కూడా భవిష్యత్‌లో మూల్యం చెల్లించవలసి రావచ్చనే సంగతి మరిచిపోతున్నారు. ఈ రాజకీయ ఆధిపత్యపోరులో టిడిపి, వైసీపీలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నష్టపోతుండటమే చాలా బాధాకరం. రాష్ట్రంలో ఈ ప్రతీకార రాజకీయాలు పెట్టుబడిదారులకి బలమైన తప్పుడు సంకేతాలు పంపిస్తాయనే సంగతి కూడా పాలకులు మరిచిన్నట్లున్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ విపరీత ధోరణి వలన మరింత నష్టపోతోంది. మరి ఏపీలో ఈ అవాంఛిత రాజకీయ వాతావరణం ఇంకా ఎప్పటికీ మారుతుందో లేదా రాబోయే రోజుల్లో ఇంకా పెరిగిపోతుందో?



