దావోస్‌లో చెప్పుకోవడానికి ఏముంది…అందుకే అలా!

YS_Jagan_Davos Tourఇదివరకు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు దావోస్ సదస్సుకు వెళితే, “అక్కడ ఆయన డబ్బిచ్చి టెంట్ వేసుకొని కూర్చొని, వచ్చిపోయేవాళ్ళతో ఫోటోలు తీయించుకొంటూ ఇక్కడ ఏపీలో గొప్పగా ప్రచారం చేసుకొంటున్నారు. కానీ ఆయన దావోస్ వెళ్ళి ఏమి సాధిస్తారు?డబ్బులు దండుగ తప్పితే,” అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు.

ఇప్పుడు జగన్ దావోస్ పర్యటన గురించి ‘తయారీ హబ్‌గా ఏపీ’ పేరుతో సాక్షి ఆన్‌లైన్‌లో మీడియాలో వచ్చిన ఆర్టికల్ చదివితే దావోస్ పర్యటనలో డొల్లతనం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.

ADVERTISEMENT

సదస్సు మొదటి రోజున ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవం చేసి సిఎం జగన్మోహన్ రెడ్డి బిజీబిజీగా గడిపారని పేర్కొనడం పెద్ద జోక్.

ఏపీలో పరిశ్రమల గురించి మాట్లాడితే విద్యుత్‌ కోతల గురించి ప్రశ్నించే ప్రమాదం ఉంటుంది. కనుక రాష్ట్రంలో పోర్టులు, విమానాశ్రయాలు, మౌలిక వసతులు ఉన్నాయని కనుక వాటి ఆధారిత పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారని పేర్కొంది. నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని, రాష్ట్రంలో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల గురించి సిఎం జగన్మోహన్ రెడ్డి సదస్సులో వివరించారని సాక్షి పేర్కొంది.

సిఎం జగన్మోహన్ రెడ్డి అంతా దూరం వెళ్ళి అక్కడ భారత్‌కు చెందిన ఆదానీ గ్రూప్ ఛైర్మన్‌ గౌతమ్ అదానీతో సమావేశమయ్యి ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించి వాటికి సంబందించి ఓ పెద్ద పుస్తకాన్ని ఆయనకు ఇచ్చారని చెపుతూ ఆయనతో ఓ ఫోటో వేసింది. అయితే గౌతమ్ అదానీ ఏపీలో పెట్టుబడి పెడతాననే మాట కూడా అనలేదు!

తరువాత ప్రపంచ ఆర్ధిక సదస్సుతో భాగస్వామ్యం కోసం వ్రాసుకొన్న ఓ ఎంఓయు పట్టుకొని ఫోటో దిగారు. అదేమీ పెట్టుబడి కాదు. ప్రపంచ ఆర్ధిక సదస్సులోని భాగస్వాములు, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేసేందుకు వ్రాసుకొన్న ఓ అగ్రిమెంట్‌ మాత్రమే.

ఏది ఏమైనప్పట్టికీ 26వరకు జరిగే సదస్సులో సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకు రాగలిగితే అందరికీ సంతోషమే. కానీ ఏపీ ఆర్ధిక, రాజకీయ, విద్యుత్‌ పరిస్థితులను కళ్ళారా చూస్తున్నవారు అంత సాహసం చేస్తారా?చూడాలి.

ADVERTISEMENT
Latest Stories