విశాఖ వేదికగా జరిగిన రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరి పాట వారు పాడుకొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్నివిదాలా సహాయసహకారాలు అందిస్తోందని, ఏపీ అభివృద్ధిలో కేంద్రం కీలకపాత్ర పోషిస్తోందని కేంద్రమంత్రులు నితిన్ గడ్కారీ, కిషన్ రెడ్డి చెప్పుకొంటే, జగనన్న కృషి, పట్టుదల, దూరదృష్టి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నంబర్:1 రాష్ట్రంగా నిలిచిందని రాష్ట్ర మంత్రులు చెప్పుకొన్నారు. ఇద్దరూ కామన్‌గా చెప్పిన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపారమైన సహజవనరులు ఉన్నాయని, కనుక ఏపీలో పరిశ్రమలు స్థాపించి వాటిని సద్వినియోగపరుచుకోవాలని!
నిజమే! రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నా సహజవనరులకు, మానవ వనరులకు ఏనాడూ కొరత లేదు. కానీ వాటిని సద్వినియోగించుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు, రాష్ట్రానికి ఆదాయం, రాష్ట్రాభివృద్ధి చేసుకొనే ఆసక్తి, ఓపిక పాలకులకు లేనందునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మట్టిలో మాణిక్యంలా మిగిలిపోయింది. కానీ వైసీపీ నాయకులు ఆ మట్టిలో మాణిక్యాలని అంటే ఇసుక, గ్రానైట్ వగైరాలను వెలికి తీసుకొని కోట్లు కూడబెడుతున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు.
శనివారం పుంగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ దారిలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన ఓ టిప్పర్ వాహనాన్ని చూపిస్తూ సెల్ఫీ దిగి, జిల్లాలో సహజ సంపదను మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఏవిదంగా దోచుకోంటోందో తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
మళ్ళీ సదస్సు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలంగా సహజవనరులున్నాయని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసని స్పష్టం అయ్యింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ఏపీని అభివృద్ధి చేయాలనుకోలేదు. కేవలం రోడ్లు నిర్మించడమే గొప్ప అన్నట్లు కేంద్ర మంత్రులు చెప్పుకొన్నారు. అదానీకి పోర్టులన్నీ కట్టబెడుతోంది కనుక వాటి అభివృద్ధి గురించి గొప్పగా చెప్పుకొన్నారు.
సాక్షాత్ ప్రధాని నరేంద్రమోడీ భూమిపూజ చేసిన అమరావతిని జగన్ ప్రభుత్వం కాదంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? పోలవరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరుగుతున్నాయని తెలిసినా ఎందుకు మౌనం వహిస్తోంది? ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఈయలేని దుస్థితిలో ఉందని, ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని సాక్షాత్ నిర్మలా సీతారామన్ చెప్పినప్పుడు కేంద్రం ఇంకా ఎందుకు అప్పులు ఇప్పిస్తోంది? ఏపీలో ఇన్ని సహజవనరులున్నా ఇంతకాలం రాష్ట్రంలో పరిశ్రమలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? అనే ప్రశ్నిస్తే కేంద్రం జగన్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తుంటుంది. ఇదే ప్రశ్న జగన్ ప్రభుత్వాన్ని అడిగితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను చూపించి చేతులు దులుపుకొంటుంది.
మూడున్నరేళ్ళుగా సంక్షేమ పధకాకాలే అభివృద్ధి అని నమ్మించే ప్రయత్నిస్తోంది తప్ప అభివృద్ధికి ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఇప్పుడైనా ఈ సదస్సు, హడావుడి, ప్రచారం, పెట్టుబడులు, ఎంవోయూలు అన్నీ కూడా ఎన్నికల కోసమే తప్ప వాస్తవ రూపం దాల్చే అవకాశంలేదనే భావించవచ్చు.
తెలంగాణ సిఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులులాగ తమ జిల్లాలని, రాష్ట్రాన్ని అభివృద్ధిచేసుకోవాలని తపించిపోతే తప్ప ఏ రాష్ట్రమూ అభివృద్ధి చెందదని చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. అసలు ఇటువంటి సదస్సులో ఏపీకి రాజధానే లేదని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా?



