
నేడు క్రిస్మస్ పండుగ సందర్భంగా వైఎస్ షర్మిల జగనన్నకు శుభాకాంక్షలు తెలిపి, క్రిస్మస్ బహుమతి పంపారో లేదో తెలీదు కానీ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి శుభాకాంక్షలు తెలిపి, క్రిస్మస్ బహుమతి పంపారు. నారా లోకేష్ ట్విట్టర్‌లో వాటిని అభిమానులతో షేర్ చేసుకొంటూ, వైఎస్ షర్మిలకు ధన్యవాదాలు తెలుపుకొని ఆమెకి కూడా నారా కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎన్నడూ లేనిది వైఎస్ షర్మిల తొలిసారిగా తన జగనన్న తీవ్రంగా ద్వేషించే చంద్రబాబు కుటుంబానికి శుభాకాంక్షలు తెలపడం, క్రిస్మస్ బహుమతి పంపించడమే చాలా ఆశ్చర్యం. దానికి నారా లోకేష్ కూడా వెంటనే సానుకూలంగా స్పందించడం గమనిస్తే ఇది ఏ సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీయబోతోందో అనే ఆలోచన కలుగుతుంది.
Also Read – కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?
ఆమె తన గ్రీటింగ్ కార్డులో ‘ద వైఎస్సార్ ఫ్యామిలీ విషస్ యూ…’ అంటూ శుభాకాంక్షలు తెలపడం గమనిస్తే, తన అన్న జగన్‌ని ఇక వైఎస్సార్ కుటుంబ సభ్యుడుగా భావించడంలేదని సూచిస్తున్నట్లే భావించవచ్చు.
ఆమె పంపిన క్రిస్మస్, న్యూఇయర్ గ్రీటింగ్‌లో “ఏ బ్లెస్డ్ 2024” అనే శుభాకాంక్షలు పైకి సాధారణంగానే కనబడుతున్నప్పటికీ, ‘ఎన్నికలు జరుగబోతున్న 2024లో టిడిపికి శుభం జరగాలని’ ఆమె కోరుకొంటున్నట్లే భావించవచ్చు.
Also Read – వైసీపీ బుట్టలో ఎల్ఐసీ… గిలగిలా కొట్టుకుంటోంది పాపం!
తెలంగాణ కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల చోటు లేదని ఇప్పటికే స్పష్టమైపోయింది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా సూచిస్తున్నారు. ఒకవేళ ఆమె ఏపీకి రాకూడదనుకొంటే రాజ్యసభ సీటు తీసుకొని సర్దుకుపోవలసి ఉంటుంది. కానీ ఆమాత్రం దాని కోసం ఆమె ఇన్నేళ్ళు రాజకీయాలలో చెమటోడ్చవలసిన అవసరమే లేదు. ఆమె కోరుకొంటే ఎప్పుడో ఏదోవిదంగా రాజ్యసభ సీటు పొందేవారు.
కానీ ఆమెకు అంతకు మించి రాజకీయ ఆలోచనలు ఉన్నాయి. కనుకనే ఏపీకి వచ్చేందుకు సిద్దపడుతున్నట్లున్నారు. అందుకే ఇప్పుడు నారా లోకేష్‌కి ఈ గ్రీటింగ్స్, ఈ బహుమతి అనుకోవచ్చేమో?ఇదే నిజమైతే ఇది తెలంగాణ కాంగ్రెస్ జగనన్నకు ఇస్తున్న ‘తొలి గిఫ్ట్’గా కూడా భావించవచ్చు.