వివేకా హత్యకేసు కీలకదశలో సీబీఐ అధికారి మార్పు… దేనికి సంకేతం?

YS-Vivekananda-Reddy-Case-Supreme-Courtవివేకా హత్య కేసులో నేడు మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వేసిన పిటిషన్‌పై నేడు జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. నాలుగేళ్ళుగా ఈ కేసు విచారణ జరుపుతున్నప్పటికీ ఇంతవరకు ఈ హత్య వెనుక కుట్రను చేదించలేకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణకు సంబందించి సీబీఐ తమకు సమర్పించిన సీల్డ్ కవర్‌ నివేదికలో ‘రాజకీయ దురుదేశ్యంతో ఈ హత్య జరిగిందని’ పలుమార్లు పేర్కొన్నారు తప్ప ఈ కుట్రను ఛేదించలేకపోయారని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. కనుక ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారిని మార్చాలని ఆదేశించింది. అయితే ఈ కేసులో సీబీఐ పేర్కొన్న ముఖ్యాంశాలపై ఈ దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదని చెపుతూ ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

ADVERTISEMENT

ఈ కేసు ఏపీలో విచారణ జరుగుతున్నంతకాలం, ప్రధాన నిందితులలో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ఒక్కసారి కూడా పిలిచి ప్రశ్నించలేకపోయారు. తిరిగి వారిపైనే నిందితులు కేసులు పెట్టడంతో వారే కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఈ కేసును సుప్రీంకోర్టు ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేసిందో ఆ తర్వాత నుంచే విచారణ వేగవంతమైందనే విషయం అందరికీ తెలుసు. సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని మూడుసార్లు హైదరాబాద్‌ రప్పించి ప్రశ్నించారు.

రెండువారాల క్రితం అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచినప్పుడు సీబీఐ అధికారులు అరెస్ట్ చేసేందుకు సిద్దం అయ్యారు కూడా. కానీ ఆయన హైకోర్టుకి వెళ్ళి అరెస్ట్ కాకుండా తప్పించుకొన్నారు. అది వేరే విషయం. కానీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నప్పుడే సిఎం జగన్మోహన్ రెడ్డి హడావుడిగా ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలతో భేటీ అయ్యారు. అవినాష్ రెడ్డిని కాపాడుకొనేందుకే సిఎం జగన్‌ ఢిల్లీ వెళ్ళారంటూ టిడిపి సభ్యులు శాసనసభలో ఆందోళన చేసి సస్పెండ్ అయ్యారు కూడా.

సిఎం జగన్‌ ఢిల్లీ వెళ్ళి వచ్చాక సీబీఐ అధికారి మారుతున్నారు. కనుక సిఎం జగన్‌ ఒత్తిడితోనే ఈ మార్పు జరిగి ఉండవచ్చని టిడిపి భావిస్తోంది. ఈ కేసు విచారణ కీలకదశకు చేరుకొన్నప్పుడు దర్యాప్తు అధికారి మారితే మళ్ళీ మొదటికి రావచ్చు లేదా సుప్రీంకోర్టు సూచన మేరకు కేసును త్వరగా చుట్టబెట్టేసినా ఆశ్చర్యం లేదు.

ఓ ప్రముఖుడి హత్య కేసులో నిందితులను సీబీఐ కనుగొని అరెస్ట్ చేయవలసి ఉండగా, నిందితులే సీబీఐ మీద కేసులు వేస్తూ ఈ స్థాయిలో సీబీఐ మీద ఒత్తిడి తేగలుగతున్నారంటే ఈ కేసు విచారణ ఏవిదంగా ముగియబోతోందో ఊహించుకోవచ్చు. ఓ ప్రముఖుడి హత్య కేసులో నిందితులను గుర్తించి చట్టప్రకారం శిక్షించలేనప్పుడు, ఈ దర్యాప్తు, విచారణ, కేసులు అంతా వృధాయే కదా?

ADVERTISEMENT
Latest Stories