సింగిల్ సింహం వెంట మరో 10 సింహాలు ఉన్నప్పటికీ ఏపీ శాసనసభ సమావేశాలకు వచ్చేందుకు భయపడుతోంది. కానీ మండలిలో బలం ఉంది కనుక వైసీపీ ఎమ్మెల్సీలు టంచన్‌గా హాజరవుతున్నారు. అక్కడ వారు కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. కనుక మండలిలో కూడా వైసీపీకి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపబోతోంది.
ఎలా అంటే ముందుగా కాస్త ఫ్లాష్ బ్యాక్ స్టోరీ… 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి తర్వాత ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి కూటమిలో చేరారు. కానీ మండలి చైర్మన్ మోషేను రాజు ఇంతవరకు వారి రాజీనామాలు ఆమోదించలేదు. ఆయన కూడా వైసీపీకి చెందినవారు కనుక బహుశః జగన్ ఆదేశం మేరకు ఆమోదించి ఉండకపోవచ్చు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఆ పార్టీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి న్యాయపోరాటాలు చేస్తోంది. కానీ వైసీపీ అధినేత జగన్‌కు అలాంటి శ్రమ లేకుండా ఐదుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేసినందుకు సంతోషించాలి కదా?
కానీ మండలిలో వైసీపీ సంఖ్యా బలం ఉందని చెప్పుకోవడానికో లేదా ఎప్పటికైనా మళ్ళీ తిరిగి వైసీపీలోకి వస్తారనే ఆశతోనో లేదా పార్టీ వీడిన వారికి రాజకీయ స్వేచ్చ లేకుండా చేయాలనో వారి రాజీనామాలు తొక్కిపట్టి ఉంచినట్లు అనుమానించాల్సి వస్తుంది.
రాజకీయ చందరంగం ఇలా… ఈ నేపధ్యంలో ఆ ఐదుగురు ఎమ్మెల్సీలు..జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీలు మండలి చైర్మన్ మోషేను రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మండలిలో బలా బలాలు ఇలా… ప్రస్తుతం మండలిలో మొత్తం 58 మంది ఎమ్మెల్సీలున్నారు. వారిలో వైసీపీ:34, టీడీపి: 10, జనసేన: 2, బిజేపి: 2 ఎమ్మెల్సీలున్నారు.
ఒకవేళ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ మోషేను రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే వారికి కూటమి సభ్యులు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందరూ కలిసి ఆయనని గద్దె దించితే కూటమికి అది లభిస్తుంది.
కనుక మండలిలో వైసీపీకి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఈ రాజకీయ చదరంగం ఆడబోతున్నట్లుంది. ఈ ఆటలో ఎవరు ఎవరికి ‘చెక్ మేట్’ చెప్తారో చూడాలి.




