11 సీట్లతో ప్రతిపక్ష హోదా లేకుండా ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీ రానున్న రోజులలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, జగన్ 2.0 నినాదాన్ని నిజం చేయడానికి కూటమి కి చేయూతనిచ్చిన కాపు ఓటింగ్ పై ఫోకస్ పెట్టిందా.? అందులో భాగమే అంబటి వ్యవహారానికి వైసీపీ కుల రంగు తొడిగిందా.?
టీడీపీ తో జనసేన పొత్తుకు సై అన్న నాటి నుంచి పవన్ ను రాజకీయంగా అండగా నిలిచిన కాపు సామాజికవర్గం టీడీపీ కి తోడుగా నిలిచింది. దాని ఫలితమే ఆ సామాజికవర్గం మెండుగా ఉన్న గోదావరి జిలాల్లో కూటమి క్లిన్ స్వీప్ చేయగలిగింది, అలాగే వైసీపీ ఖాతా తెరవలేకపోయింది.
అయితే దీని వెనుక కూటమి పొత్తుకు తోడు వైసీపీ పవన్ పై చేసిన వెకిలి రాజకీయం, వ్యక్తిగత విమర్శలు కూడా ప్రముఖ పాత్ర పోషించాయి, అవే వైసీపీ కి కాపు ఓటింగ్ ని దూరం చేసాయి. అయితే విషయం గ్రహించిన వైసీపీ, టీడీపీ – జనసేన ల మధ్య కుల రాజకీయ చిచ్చులు పెట్టి బాబు – పవన్ ల మధ్య ఏర్పడిన రాజకీయ బంధాన్ని విచ్చిన్నం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది.
ఇక ఆ ప్రణాళిక బెడిసి కొట్టడంతో ఎలా అయిన కాపు సామాజికవర్గ ఓటింగ్ ని కూటమికి దూరం చేసి వైసీపీ కి దగ్గర చేసుకోవాలని వైసీపీ కాపు రాజకీయం మొదలుపెట్టింది. ఇక అందుకు వైసీపీ కాపు నేత అంబటి రాంబాబు అరెస్టును ఆ పార్టీ ఒక రాజకీయ అస్త్రంగా వాడుతుంది.
అంబటి ఇంటి పై జరిగిన దాడి కాపు నేత పై జరిగిన దాడిగా, టీడీపీ నాయకత్వం కాపు ల అణిచివేతకు వేసిన ఒక రాజకీయ పథకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అలాగే అంబటి వ్యవహారాన్ని దివంగత కాపు నేత రంగా హత్యతో ముడిపెట్టి ఆ సామాజికవర్గాన్ని రెచ్చకొట్టేందుకు వైసీపీ నీలి మీడియా కథనాలను ప్రచారంలోకి తెచ్చింది.
అందులో భాగంగానే ముద్రగడ నుంచి గుడివాడ, ధర్మశ్రీ, బొత్స, పేర్ని నాని వంటి వైసీపీ కాపు నేతలందరూ అంబటి ఇంటికి పరామర్శల యాత్ర మొదలుపెట్టారు. ఇక తాజాగా నేడు విశాఖ కేంద్రంగా మాజీ మంత్రి ధర్మశ్రీ ఇంట్లో వైసీపీ కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ మీట్ ఏర్పాటు చేసి ఈ వ్యక్తిగత వివాదాన్ని కుల వివాదంగా మలిచేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తుంది.
ఇందుకోసం అంబటి రాంబాబు మీడియా ముందుకొచ్చి తన ఇంటి పై జరిగిన దాడి ని ఒక కులం మరో కులం పై జరిపిన దాడిగా పేర్కొన్నారు. తన ఇంటి పై జరిగిన దాడిని ముఖ్యమంత్రి బాబు, మంత్రి లోకేష్ మోనిటర్ చేసారని, వీరిద్దరి ప్రోత్సాహంతో, పోలీసుల ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందన్నారు.
నాడు ఇదే పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుని రంగా హత్య జరిగిందని, నేడు కూడా ఇదే పోలీసుల నిర్లక్ష్యంతో తన ప్రాణాల మీదకొచ్చిందని, రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యంగంలో భాగంగా తనను అన్యాయంగా 18 రోజుల పాటు అరెస్టు చేసి జైల్లో పెట్టారంటూ అంబటి బాబు, లోకేష్ పై మండిపడ్డారు.
అయితే వైసీపీ చేస్తున్న ఈ కాపు రాజకీయాలు ఫలిస్తాయా.? ఆ సామాజికవర్గం ఓటర్లు వైసీపీ చేస్తున్న ఈ నీలి ప్రచారాలను విశ్వసించి పవన్ కాదని, కూటమి వద్దనుకుని వైసీపీ దగ్గరవుతారా.? జగన్ ను మరోసారి అందలం ఎక్కించేందుకు సిద్దమవుతారా.? లేదా వైసీపీ చేస్తున్న ఈ కుల రాజకీయ ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసలుగానే మిగిలిపోనున్నాయా.?




