వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు రాజకీయంగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటు పార్టీ కార్యక్రమాలలో గాని అటు సొంత నియోజకవర్గంలో కానీ ఈ నేతలు పార్టీ క్యాడర్ కి సైతం అందుబాటులో లేకుండా, మీడియా కంటికి కనిపించకుండా ఉన్నారు.
వారిలో ముఖ్యంగా వైసీపీ ఫెయిర్ బ్రాండ్స్ గా మంచి గుర్తింపు పొందిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ ఓటమి తరువాత ఎక్కడ తన పార్టీ గొంతు వినిపించలేదు. తాజాగా కొడాలి మీడియా ముందుకొచ్చారు.
అంబటి అరెస్టు వ్యవహారం పై తన స్పందన తెలియయచేసి 2029 లో అధికారంలోకి వచ్చేది వైసీపి నే అని కాబోయే ముఖ్యమంత్రి జగనే అంటూ తన స్వామి భక్తిని మరోసారి నిరూపించుకున్నారు.
అయితే ఇన్నాళ్ళుగా వైసీపీ పార్టీ చుట్టూ ఎన్ని వివాదాలు చుట్టి ముట్టినా నోరు మెదపని ఈ సోకాల్డ్ నేత ఇప్పుడు సడెన్ గా బయటకొచ్చి వైసీపీ క్యాడర్ కి భరోసా కల్పించడం వెనుక వ్యూహమేమిటి అనే చర్చ జరుగుతుంది.
కొడాలి కూడా ఇలా మెల్లగా పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చి అంబటి మాదిరే టీడీపీ అధినాయకత్వం మీద నోరుజారితే ఆ పై ప్రభుత్వం తీసుకునే చర్యలను తన పార్టీకి అనుకూలంగా మలచుకునేందుకే జగన్, కొడాలిని తెరమీదకు తెచ్చారా.? అంబటితో కాపు కుల రాజకీయాలు చేసిన వైసీపీ కొడాలి తో కమ్మ వారితో రాజకీయం మొదలుపెట్టనుందా.?
ఇక టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో అరెస్టయ్యి బెయిలు మీద బయటకొచ్చిన వల్లభనేని కూడా ఇంతవరకు కూటమి ప్రభుత్వం పై నోరెత్తి ఒక్క విమర్శ కానీ ఒక్క అవినీతి ఆరోపణ కానీ చెయ్యలేదు. వంశీ కూడా అంబటి పరామర్శ కై బయటకు వచ్చినా మీడియా ముందుకొచ్చి ప్రభుత్వం పై కానీ బాబు, లోకేష్ ల పై కానీ ఎటువంటి రాజకీయ ఆరోపణ చెయ్యలేదు.
ఇక కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యేగా నాడు వైసీపీ లో చక్రం తిప్పిన ద్వారంపూడి సైతం 2024 తరువాత ఎక్కడ కనిపించలేదు, వినిపించలేదు. సీజ్ ది షిప్ అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ ఫోర్ట్ లో కీలక ప్రకటన చేసినప్పటికీ ద్వారంపూడి సైలెంట్ గానే తెరచాటు రాజకీయంతో వివాదానికి ముగింపు పలికారు తప్ప గతంలో మాదిరి నోటికి పనిచెప్పలేదు.
ఇక రాబోయే ఎన్నికల సమయానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని హీటెక్కించేందుకే వైసీపీ ఇలా పార్టీ ఫెయిర్ బ్రాండ్లను వ్యూహాత్మకంగానే అజ్ఞాతంలో ఉంచిందా.? ఇప్పుడు అందులో నుంచి ఒక ఫెయిర్ బ్రాండ్ ని రంగంలోకి దింపిందా.?
ఇక రానున్న మూడేళ్లు వైసీపీ ఇంకెన్ని రాజకీయ వ్యూహాలను రచిస్తుందో.? ఇంకెన్ని వివాదాలకు కుల ముద్ర వేస్తుందో.? ఇంకెన్ని బూతు రాజకీయాలను డైవర్షన్ పాలిటిక్స్ వైపు మళ్లిస్తుందో.? ఇంకెంతమంది ఫెయిర్ బ్రాండ్లను రాజకీయ తెరమీదకు తెస్తుందో.?
రాజకీయాలలో చిన్న పాముని కూడా పెద్ద కర్రతో కొట్టాలి అనే నానుడి వినపడుతుంది. మరి ఈ పెద్ద తలయకాలను కూటమి ఎందుకింత చిన్న చూపు చూస్తున్నట్టు.?




