మా నమ్మకం నువ్వే… మా భవిష్యత్ నువ్వే జగనన్న అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ స్టిక్కర్స్ అంటించాలనే ఐప్యాక్ ఐడియా బెడిసికొడుతోంది. ఇప్పటికే గడప గడపకి కార్యక్రమంలో ప్రజల నుంచి ఛీత్కారాలు భరించలేక ఆ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారు. ఏదోవిదంగా ఆ కార్యక్రమం ‘మమ’ అనిపించేశామని అందరూ రిలాక్స్ అవుతుంటే, ఐప్యాక్ వారికి మరో టాస్క్ ఇచ్చింది. ఐప్యాక్ సూచన మేరకు ఈ స్టిక్కర్స్ అంటించే కార్యక్రమం మొదలుపెట్టాలని జగనన్న హుకుం జారీ చేయడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వైసీపీ సంచీలు భుజానికి తగిలించుకొని రోడ్డున పడక తప్పడం లేదు… మళ్ళీ ప్రజల నుంచి ఛీత్కారాలు భరించక తప్పడం లేదు. అది వేరే విషయం.
వైసీపీకి పోటీగా టిడిపి, జనసేన పార్టీలు కూడా స్టిక్కర్స్ అంటిస్తున్నాయి. ఇది కూడా ఊహించినదే కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించని ట్విస్ట్ ఏమిటంటే, ఈ స్టిక్కర్స్ అంటింపు కార్యక్రమం పార్టీలో అంతర్గత కుమ్ములాటలను కూడా బయటపెడుతుందని.
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఈ స్టిక్కర్స్ కార్యక్రమం జోరుగా సాగుతుంటే, ఈ రోజు ఉదయం సొంత పార్టీకే చెందిన కొందరు రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జున రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్స్ అంటించారు. దానిలో “మా నమ్మకం నువ్వే జగనన్న కానీ రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జున రెడ్డి మీద మాకు నమ్మకం లేదు,” అంటూ వ్రాసి, కిందన ఎమ్మెల్యే చేతిలో మోసపోయిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అని వేశారు.
“వైసీపీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయని, కానీ ప్రతీ రాజకీయ పార్టీలో ఇవి చాలా కామన్,” అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కానీ ఆ సెగలు గోడల మీద పోస్టర్లు, ఫ్లెక్సీ బ్యానర్ల వరకు వెళితేనే ఇబ్బంది. ఇప్పుడు రాజంపేటలో అదే జరుగుతోంది. గన్నవరం, నెల్లూరు, ఉత్తరాంద్ర జిల్లాలలో కూడా సెగలు వస్తున్నాయి. నేడు రాజంపేటలో పోస్టర్స్ రూపంలో బయటపడితే రేపు అక్కడా బయటపడవచ్చు. పార్టీలో నేతలు ఈ విదంగా కుమ్ములాడుకొంటుంటే “నువ్వే మా నమ్మకం జగనన్న” అని ప్రజలను చెప్పమంటే చెప్తారా?



