ఇటీవల ఉయ్యూరులో ప్రవాస భారతీయుడు, టిడిపి నాయకుడు ఉయ్యూరు శ్రీనివాస్ అధ్వర్యంలో చంద్రబాబు నాయుడు సంక్రాంతి కానుకల పంపిణీ జరిపినప్పుడు తొక్కిసలాటలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. అందుకు పోలీసులు ఉయ్యూరు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. ఉయ్యూరు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేయడాన్ని ఆయన స్నేహితుడు, మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తప్పు పట్టారు. ఉయ్యూరు శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి అని ఆయన చాలా కాలంగా సామాజిక సేవాకార్యక్రామలు నిర్వహిస్తున్నారని, అటువంటి వ్యక్తిపై రాజకీయ కారణాలతో కేసు పెట్టి వేధించడం సరికాదని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ బాహాటంగానే విమర్శించారు.
వసంతకృష్ణ ప్రసాద్‌కి, మంత్రి జోగి రమేష్‌కి మద్య చాలా కాలంగానే విభేధాలున్నాయి. కనుక ఆయనతో ఈ పోరు భరించలేనని, మళ్ళీ తనకే టికెట్ ఇస్తానని హామీ ఇస్తేనే నియోజకవర్గంలో గడప గడపకి తిరుగుతానని లేకుంటే వృదా ప్రయాస ఎందుకని వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా గడప గడపకి కార్యక్రమంలో తిరగాలని సిఎం జగన్ నొక్కి చెపుతుంటే వసంత కృష్ణ ప్రసాద్ ఈవిదంగా తిరుగుబాటు ధోరణిలో మాట్లాడుతుండటం, తాజాగా ఉయ్యూరు ఘటనలో ప్రత్యర్ధి పార్టీకి చెందిన వ్యక్తిని వెనకేసుకువస్తూ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేయడంతో, వైసీపీలో ఆయనకి పొగ పెట్టేందుకు మంత్రి జోగి రమేష్‌కి మంచి అవకాశం లభించిన్నట్లయింది. కనుక ఇప్పుడు వసంతకృష్ణ ప్రసాద్ గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనకపోతే వైసీపీ నుంచి బయటకి సాగనంపేందుకు రంగం సిద్దం అయినట్లే భావించవచ్చు.



