“ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేను జైల్లో ఉన్నప్పుడే నన్ను విడిపించేందుకు బీఆర్ఎస్ పార్టీని బిజేపిలో విలీనం చేసేందుకు కేసీఆర్ సిద్దపడ్డారు. కానీ నా కోసం తెలంగాణ ప్రజల ఆశలను చిదిమేయొద్దని చెప్పి ఆపాను,” అని కల్వకుంట్ల కవిత స్వయంగా చెప్పిన మాటని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వస్తోంది.
ఎందుకంటే, తెలంగాణ బిజేపి ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇటీవల శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, “రాజకీయాలలో పొత్తులు, విడిపోవడాలు చాలా కామన్. గతంలో మేము ఏపీలో టీడీపితో పొత్తులో ఉన్నాం. తర్వాత విడిపోయాం. మళ్ళీ కలిసి అధికారంలోకి వచ్చాము. తెలంగాణలో కూడా అలాగే బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తే తప్పేమిటి? ఒక కాలుకి దెబ్బ తగిలి నడవలేకపోతే చేతికర్ర ఊతంగా వాడుకోవడం తప్పు కాదు. రాజకీయాలలో కూడా అంతే!” అని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ మూల స్థంభాలలో ఒకరైన హరీష్ రావు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, “నువ్వు (రేవంత్ రెడ్డి) మళ్ళీ అధికారంలోకి వస్తావని మర్చిపో. అది పగటి కల. వచ్చేది కేసీఆర్ రాజ్యం-రామ రాజ్యమే,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న జీవన్ రెడ్డి కూడా కేసీఆర్-మోడీ పాలన అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.
కనుక చేతికర్ర, రామ రాజ్యం, మోడీ అద్భుత పాలన మూడు కలిపి చూస్తే వచ్చే ఎన్నికలలో బిజేపిలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కావడం లేదా రెండూ పొత్తులు పెట్టుకొని పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
బిజేపిలో బీఆర్ఎస్ విలీనం చేసే ఆలోచన ఉందని కవిత ముందే చెప్పారు. ఈ షరతుతోనే ఆమె విడుదలైనట్లు భావించాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఆమె బయటకు వెళ్ళి సొంత కుంపటి పెట్టుకుంటున్నారు. ఆ కుంపటికి బొగ్గులు, అగ్గి ఎవరిస్తున్నారు? అంటే ‘రేవంత్ రెడ్డి’ అని బిజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తున్నారు. కానీ బిజేపి కూడా కావచ్చు కదా?
ఏది ఏమైనప్పటికీ ఆమె గేట్లు తీయగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు తప్పవు. కనుక అప్పుడు ఇంకా బలహీన పడుతుంది. ఈ పరిస్థితిలో బిజేపిలో విలీనం మంచిదా? పొత్తులు మంచివా? ఏది లాభం? ఏది నష్టం? ఎంత శాతం? అనే లెక్కలు తేల్చుకుంటే చాలు.
ఆ తర్వాత మరోసారి ‘బంగారి తెలంగాణ కోసం రాజకీయ పునరేకీకరణ’, ‘రాజకీయాలలో గుణాత్మక మార్పు’ వంటి గంభీరమైన పదాలతో సరికొత్త స్టోరీ చెపుతూ ప్రజల ముందుకు వెళ్ళిపోవచ్చు.
కానీ బిజేపి-బీఆర్ఎస్ పార్టీ పొత్తు లేదా విలీనాన్ని బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి సీనియర్ నేతలు అంగీకరిస్తారా? ప్రధాని మోడీ, అమిత్ షాలను దుమ్మెత్తిపోసిన కేసీఆర్, కేటీఆర్ వారి ముందు చేతులు కట్టుకొని నిలబడగలరా? వద్దనుకుంటే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకొని విలీనం, పొత్తులకి లైన్ క్లియర్ చేస్తారా?
ఎన్డీయేలో బీఆర్ఎస్ పార్టీని చేర్చుకుంటే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారా? వంటి ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెపుతుంది.




