నేడు యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి రాజధాని అమరావతి గురించి మాట్లాడుకుంటోంది. అంతర్జాతీయస్థాయిలో అమరావతి నగరం నిర్మితమవుతుండటం, దానిలో దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ ఏర్పాటు కాబోతుండటంతో యావత్ దేశం అమరావతి వైపు చూస్తోంది.
శనివారం మధ్యాహ్నం 3 గంటలకు అమరావతిలో ‘క్వాంటం వ్యాలీ’కి సిఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి డా.జితేంద్ర సింగ్ కలిసి భూమిపూజ చేయనున్నారు. ఉద్దండరాయునిపాలెంలో 50 ఎకరాల విస్తీర్ణంలో 90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ‘క్వాంటం వ్యాలీ’ భవన సముదాయాలను నిర్మించబోతోంది. దీనిలో ప్రఖ్యాత ఐబీఎం, టిసీఎస్, ఎల్&టి కంపెనీలు భాగస్వాములుగా ఉన్నాయి.
క్వాంటం వ్యాలీ నిర్మాణ బాధ్యతలు ఎల్&టి కంపెనీ, దానిలో క్వాంటం టెక్నాలజీ ఏర్పాటు బాధ్యత ఐబీఎం చేపడుతున్నాయి. క్వాంటం వ్యాలీలో 136 క్యూబిట్ల సామర్ధ్యంతో ఐబిఏం హెరాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్నారు.
ఏడాదిన్నరలోగా ‘క్వాంటం వ్యాలీ’ నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇది అందుబాటులోకి వస్తే దీనిలో క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, డీప్‌టెక్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు, శిక్షణ, సేవలు లభిస్తాయి. ఈ ఒక్క క్వాంటం వ్యాలీ ద్వారానే సుమారు 88,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి.






