ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ నాయకులకు జీవన్మరణ సమస్యగా మారబోతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. స్థానిక సంస్థల ఏకగ్రీవాలకు ఎట్టిపరిస్థితులలో ఆస్కారం ఉండకూడదు అంటూ జగన్ ఇచ్చిన అల్టిమేటం పార్టీ నేతలను తీవ్ర రాజకీయ ఒత్తిడికి గురిచేస్తుంది.
పార్టీ గెలుపు సంగతి పక్కన పెట్టి, పార్టీ పోటీ చేస్తే చాలు అనే స్థాయికి వైసీపీ రాజకీయంగా పతనమయ్యిందా అన్నట్టుగా జగన్ పార్టీ నేతలకు తన హెచ్చరికలతో పరోక్ష సంకేతాలిచ్చారా.? లేదా గత వైసీపీ ప్రభుత్వం తాలూకా ఏకగ్రీవాలు జగన్ ను వదల బొమ్మాలి వదలా అంటూ వెంటాడుతున్నాయా.?
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్ స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవాలను దగ్గరుండి ప్రోత్సహించారు. దాని ఫలితమే సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ జెండా రెపరెపలాడింది.
అయితే నాడు తీపి జ్ఞాపకాలుగా మారిన ఆ ఏకగ్రీవాలు నేడు జగన్ కు చేదు జ్ఞాపకాలను మిగల్చబోతున్నాయా.? ఆ సందేహమే జగన్ కు ఏకగ్రీవాల భయం పట్టుకునేలా చేసిందా.? జగన్ వార్నింగ్ తో ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ ఇంచార్జ్ ల రాజకీయ భవిష్యత్ కి మరణశాసనం గా మారనున్నాయా.?
ఇప్పటికే 2024 ఎన్నికలలో నియోజకవర్గాల మార్పు అనే జగన్ ఎన్నికల వ్యూహంతో ఏ నాయకుడు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసారో కూడా గుర్తు పెట్టుకోలేని స్థితిలో నాయకులు ఉన్న ప్రస్తుత తరుణంలో తాజాగా జగన్ చేసిన ప్రకటన వైసీపీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
ఏకగ్రీవాలు….అనే ‘గతం’ ‘వర్తమానం’గా మారి వైసీపీ నేతల రాజకీయ ‘భవిష్యత్’ ని భయపెడుతుందా.? అన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో గట్టిగా నడుస్తుంది. మరి జగన్ ఆదేశానుసారం వైసీపీ ఇంచార్జ్ లు ఏమేరకు క్షేత్ర స్థాయిలో ఫలితాలు సాధిస్తారు అనేది మరికొద్ది రోజులలో తేలనుంది.





