రాజకీయాలలో గుర్తింపు సంపాదించుకోవడం, పార్టీలో ఎదగడం, ఎన్నికలలో టికెట్ సాధించడం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా ఎన్నికవడం… ఇలా ప్రతీదశలోను ఎంతో వ్యయప్రయాసలు తప్పవు.
అన్నిటికీ మించి ప్రతీ దశలోను తీవ్రమైన పోటీ తప్పదు. ఎమ్మెల్యే టికెట్ల కోసమే ఏళ్ళ తరబడి ఎదురుచూసేవారు అన్ని పార్టీలలో కోకొల్లలున్నారు.
ఇన్ని పరీక్షలలో నెగ్గిన తర్వాత మంత్రి పదవులకు మరో పెద్ద పోటీ ఉంటుంది. వాటి కోసం పార్టీ అధిష్టానంతో, సాటి నేతలతో పోరాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్ పార్టీలోనే కోకొల్లలున్నారు.
కనుక మంత్రి పదవి చాలా విలువైనదని అర్ధమవుతోంది. అలాంటి అవకాశం దక్కినా నిలుపుకోలేకపోతే రాజకీయాలలో పతనం తప్పదు. తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ పరిస్థితి సరిగ్గా ఇదే.
ఆమె కాంగ్రెస్, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలలో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కనుక ఆమెకు ఎమ్మెల్యే టికెట్ కూడా కష్టమనుకుంటే, సిఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు.
మంత్రివర్గ సమావేశంలో కావచ్చు సభలు, జిల్లా పర్యటనలలో కావచ్చు.. ఆమె సిఎం రేవంత్ రెడ్డి పక్కనే కనిపిస్తుంటారు. అంటే ఆమెకు సిఎం ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
కానీ ఇప్పుడు కుమార్తె కొండ సుస్మిత నోటి దురద కారణంగా సురేఖ మంత్రి పదవి ఊడేలా ఉంది. సుమారు 16 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఆమె నియోజకవర్గంలో నేతలే ఆమెను తక్షణం మంత్రి పదవిలో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. బహుశః వారందరూ ఆమెని బయటకు గెంటేస్తే తమకు ఆ మంత్రి పదవి లభిస్తుందని ఆశ పడుతున్నవారయినా ఆశ్చర్యం లేదు.
ఇప్పటికే కొండా సురేఖ పలుమార్లు వివాదాలలో చిక్కుకొని సిఎం రేవంత్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారారు. అయినప్పటికీ సహిస్తూనే ఉన్నారు.
కానీ ఇది అర్థం చేసుకోకుండా తన భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్నారు. అదే… వారి కుమార్తె సుస్మిత నోట వినిపించింది.
కేవలం అసంతృప్తి వ్యక్తం చేసి ఊరుకుంటే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి, అయన సోదరులపై అవినీతి ఆరోపణలు చేసి, బండారం బయట పెడతానని, ముఖ్యమంత్రి మారుతారంటూ సుస్మిత హద్దులు దాటారు. అప్పుడు మంత్రి సురేఖ వెంటనే ఖండించి క్షమాపణలు చెప్పుకొని ఉంటే బహుశః ఈ సమస్య సద్దుమణిగేదేమో?
కానీ కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకోవడం ద్వారా పరోక్షంగా ఆమె ఆరోపణలను సమర్ధించినట్లే అయ్యింది.
కనుక సిఎం రేవంత్ రెడ్డి రేపు లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగి చేరుకోగానే, మొట్ట మొదట ఈ పంచాయితీపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
జరిగేదేదో ఎలాగూ జరుగుతుంది. కానీ కొండా వ్యవహారం మంత్రి పదవులలో ఉన్నవారికి, పదవులు ఆశిస్తున్నవారికీ ఓ ‘కేస్ స్టడీ’గా పనికివస్తుంది.





