వైసీపీలో అంబటి రాంబాబుకి తెలుగులో మంచి ధాటిగా తడబడకుండా మాట్లాడగల నేర్పు ఉంది. అయితే దానిని వాక్చాతుర్యంగా భావిస్తూ అయన మాట్లాడే మాటలే బెడిసి కొడుతూ ఉంటాయి. ఇందుకు తాజా ఉదాహరణగా ఆయన మాట్లాడిన మాటలు చెప్పుకోవచ్చు.
ముద్రగడ కుటుంబమే ఆయనకు అధికార లాంచనాలు వద్దనప్పుడు పోలీసులు ఎందుకు వచ్చారు?చనిపోయిన వ్యక్తికి అధికార లాంచనాలు అవసరమా? దాని వలన ఆత్మశాంతిస్తుందా? శాంతించదు కదా? కనుక ముద్రగడ ఆత్మశాంతి కోసమే నేను పోలీసులను అడ్డుకున్నాను.
నాపై ప్రభుత్వం పగ పట్టినట్లు వ్యవహరిస్తోంది. నేను పోలీసులతో ఘర్షణ పడిన ప్రతీసారి నాపై ఓ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నారు. ఇప్పుడూ నాపై మరో కేసు నమోదు చేశారు.
నాపై మరో వంద కేసులు నమోదు చేసినా భయపడే ప్రసక్తే లేదు. కానీ నాపై పెట్టే ఈ కేసులతోనైనా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను.
పవన్ కళ్యాణ్ కాపుల ప్రతినిధినని ప్పుకుంటున్నప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎందుకున్నారు?” అని అంబటి రాంబాబు అన్నారు.
అధికార లాంచనాలతో ఎవరికీ ఆత్మశాంతి కలుగదు. అది కేవలం చనిపోయిన వ్యక్తి పట్ల ప్రకటించే గౌరవం మాత్రమే. కానీ పెద్దాయనకు ఆ గౌరవం కూడా దక్కనీయకుండా చేసినందుకు ఆయనకు ఆత్మశాంతి కలుగుతుందని అంబటి రాంబాబు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
పోలీసులు ఎందుకు తనపై కేసులు పెడుతున్నారో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. మళ్ళీ ప్రభుత్వం పగ అంటూ మాట్లాడుతున్నారు. కానీ పోలీసులు వైసీపీలో అందరిపై కేసులో పెట్టడం లేదు కదా?
వారి విధులకు ఆటంకం కలిగించినవారిపై లేదా తమ పట్ల అనుచితంగా వ్యవహరించినందుకే కదా ఆయనపై కేసులు నమోదవుతున్నాయి. అలాంటి కేసులతో పెద్దాయనకి ఆత్మశాంతి లభిస్తుందని చెప్పుకోవడం మరీ విచిత్రంగా ఉంది.
పవన్ కళ్యాణ్ ఏనాడూ తాను కాపుల ప్రతినిధిని అని చెప్పుకోలేదు. పైగా తనను కాపు నాయకుడుగా చూడవద్దని పదేపదే చెపుతుంటారు. కులాలకు అతీతంగా అందరం కలిసి పనిచేద్దామని చెపుతుంటారు. ఈ విషయం కాపు నాయకుడుగా గుర్తింపు కోసం ఆరాటపడుతున్న అంబటి రాంబాబుకి కూడా బాగా తెలుసు.
అయినా కాపులు ఫలానా పార్టీలోనే ఉండాలనే నియమం ఏమీ లేదు కదా? ఉండి ఉంటే అంబటి రాంబాబు వంటి కాపు నేతలు, రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీలో ఎందుకున్నారు? అని ప్రశ్నించాల్సి ఉంటుంది.
అంబటి రాంబాబు తనకు మంచి మాటకారితనం ఉందనే భ్రమలో ఎప్పుడూ ఉంటారు. అందుకే ఇలా నోటికొచ్చినట్లు అనర్గళంగా ఏదో మాట్లాడేసి నవ్వుల పాలవుతూ ఉంటారు.




