చింతచచ్చిన పులుపు చావలేదు అన్న చందంగా జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో కూడా మెరుగైన ఫలితాలను పొందలేకపోయినప్పటికీ ఆ పార్టీ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థి నుంచి పార్టీ సీఎం వరకు అన్ని నిర్ణయాలు అధిష్టానం ఆశీస్సులతో జరగాలనే భావనలోనే ఉంటుంది.
అయితే ఈ భావనను తప్పించడంలో, తన నిర్ణయాలకు అధిష్టానం ఆమోద ముద్ర వేసేటట్లు చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో కూడా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని, అభిష్టాన్ని నెరవేర్చుకోగలిగిన ఏకైక నేతగా వైఎస్ కు ఆ పార్టీలో ఒక స్పెషల్ గుర్తింపు, గౌరవం ఉంది.
తన అన్వదీయులకు మంత్రి పదవులు కేటాయించుకోవడంలో, తనకు కావాల్సిన వారిని రాజ్యసభకు పంపడంలో, తనకు అవసరమైన వారికీ పార్టీ పదవులు కట్టబెట్టడంతో ఒకరకంగా పార్టీ అధిష్ఠానానిదే అయినా పెత్తనం మొత్తం వైఎస్ఆర్ దే అనేలా తన హయాంలో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పగలిగారు.
అయితే ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు ఆ అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందా అంటూ పార్టీలో ఇంటర్నల్ గా తెలంగాణ రాజకీయాలలో బహిరంగంగా చర్చ జరుగుతుంది. టి కాంగ్రెస్ లో అధిష్టానం అడుగులకు మడుగులొత్తే ఎంతోమంది సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నా,
సోనియా, రాహుల్ కు వీరవిధేయులుగా ఉండే నేతలు ఉన్నా వారందరిని కాదని ఎటువంటి పాలనాపరమైన అనుభవం కూడా లేని, టీడీపీ పార్టీ నుంచి వలసవచ్చిన రేవంత్ రెడ్డి కి ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టి ఆయన నాయకత్వానికే జై కొట్టింది కాంగ్రెస్ అధిష్టానం.
2023 లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ పడ్డ కష్టం, బిఆర్ఎస్ ప్రభుత్వం ఆయన చేసిన రాజకీయ పోరాటం, ప్రత్యర్థి పార్టీల పై కొనసాగించిన పొలిటికల్ యుద్ధం అన్ని కూడా రేవంత్ కి అధిష్టానం మెప్పుని సంపాధించిపెట్టాయి. ఇక జూబ్లీహిల్స్ వంటి బిఆర్ఎస్ బలమున్న ప్రాంతంలో జరిగిన ఉపఎన్నికలలో కాంగ్రెస్ విజయం అందుకోవడం,
తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ హావ కొనసాగించడంతో అధిష్టానం వద్ద రేవంత్ ప్రభంజనం నడుస్తుంది. రేవంత్ నిర్ణయాన్ని కాదని కాంగ్రెస్ అధిష్టానం ముందుకెళ్లడం లేదని తాజాగా రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ నేతల లిస్ట్ చూస్తే యిట్టె అర్దమవుతుంది.
తెలంగాణ నుంచి భర్తీ చేయవల్సిన రెండు రాజ్యసభ సీట్ల విషయంలో ఒకటి అధిష్టానం కోరిక మేరకు సంఘ్వి కి కేటాయించగా మరొకటి రేవంత్ కోరిక మేరకు వేం నరేంద్ర రెడ్డి కి వరించింది. రేవంత్ ముఖ్యమంత్రి పదవి అధిరోహించగానే వేం నరేంద్ర రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.
ఇప్పుడు ఏకంగా రాజ్యసభకు నామినేట్ చేసారు. ఇలా రేవంత్ అతి చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరచగలుగుతున్నారు, అలాగే దాన్ని అధిష్టానం వద్ద అమలు చేయించుకోగలుతున్నారు. దీనితో అప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు రేవంత్ అంటూ పార్టీలో వీరి హవా గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.




