తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు పార్టీల పరంగా కాంగ్రెస్ vs బిఆర్ఎస్ గా సాగినా అవి ముఖ్యంగా రేవంత్ vs కేటీఆర్ గానే చూస్తున్నారు, చూసేలా చేస్తున్నారు. అధికార పార్టీ పై కేటీఆర్ చేస్తున్న విమర్శల దాడి ప్రత్యక్షంగా, పరోక్షంగా రేవంత్ కేంద్రంగానే సాగుతున్నాయి.
అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కల్వకుంట్ల కుటుంబం పై ప్రత్యక్ష పోరుకే సై అంటున్నారు. ఇందులోకి కేసీఆర్, కేటీఆర్ తో పాటు హరీష్ కూడా చేర్చడంతో రేవంత్ ఒక్కరే ఈ ముగ్గురిని ఢీ కొట్టడానికి సిద్డమయ్యారు.
మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికల మాదిరే ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ని గెలిపించి తద్వారా రాష్ట్రంలో తన పట్టు తగ్గలేదని, కాంగ్రెస్ పాలన మీద ప్రజావ్యతిరేకత లేదని, బిఆర్ఎస్ ని నమ్మే పరిస్థితి రాలేదని రేవంత్ చాల బలంగా నొక్కి వక్కాణించాలని భావిస్తున్నారు.
ఇక బిఆర్ఎస్ ఓటమి తరువాత పార్టీ బాధ్యతలు భుజాన వేసుకున్న కేటీఆర్ ఏ ఒక్క ఎన్నికలలో కూడా పార్టీని గట్టెక్కించలేకపోయారని, కేటీఆర్ ని నమ్మి ఓటేసేందుకు తెలంగాణ ప్రజలు ముందుకు రారు అనేదానికి ఈ ఎన్నికల ఫలితాలే సంకేతాలంటూ కాంగ్రెస్ బిఆర్ఎస్ ని రాజకీయంగా, నైతికంగా దెబ్బకొట్టేందుకు చూస్తుంది.
ఇక అధికార పార్టీ వ్యూహాలు ఇలా ఉంటే, ప్రతిపక్ష బిఆర్ఎస్ ప్రణాళికలు మరోలా కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ నేత, ప్రత్యేక రాష్ట్రం సాధించిన నాయకుడు, తెలంగాణ జాతిపితగా గౌరవించే కేసీఆర్ కి రేవంత్ ప్రభుత్వం నోటీసిలిచ్చి విచారణకు తీసుకెళ్లింది అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి రేవంత్ వ్యూహాలకు కౌంటర్లు రెడీ చేసుకుంటుంది బిఆర్ఎస్.
గతంతో పోలిస్తే పంచాయితీ ఎన్నికలలో బిఆర్ఎస్ ఆశించినదానికంటే మంచి ఫలితాలనే చూడడంతో తెలంగాణలో రేవంత్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత మొదలయ్యింది అంటూ నాడు కేటీఆర్ నానా హంగామా చేసారు. ఇక ఇప్పుడు కూడా అదే నినాదంతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.
కాంగ్రెస్ రాకతో హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది, తెలంగాణ లో భూముల ధరలు పడిపోయాయి, రేవంత్ బాబుతో కలిసి తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నారు అంటూ అటు ప్రాంతీయవాద రాజకీయానికి సిద్ధమయ్యింది బిఆర్ఎస్.
ఇలా రెండు పార్టీలు కూడా ఒకరి పై ఒకరు పై చేయి సాధించాలని చూస్తున్నా, అది రేవంత్ పై కేటీఆర్ గెలుపు అని, లేదా రేవంత్ చేతిలో కేటీఆర్ మరోసారి చిత్తూ అనే ఆయా పార్టీలు ప్రచారం చేసుకోనున్నాయి. మరి ఈసారి రేవంత్ ఇచ్చిన నోటీసులు ఫలిస్తాయా.? కేసీఆర్ ఎదుర్కున్న విచారణ ఫలితాలను నిర్దేశిస్తుందా.?






