కాంగ్రెస్‌ పిలక కేసీఆర్‌ చేతికి ఇచ్చేందుకు ఇంత ఆరాటం దేనికి?

Vemuri Radhakrishna on Congress politics

యధార్ధవాది లోక విరోధి అనే మాట అక్షరాల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్, అధినేత వేమూరి రాధాకృష్ణకు సరిపోతుంది. సినీ పరిశ్రమలో సైతం యధార్ధాలు మాట్లాడలేని పరిస్థితి నెలకొన్న ఈ రోజుల్లో, రాజకీయాలలో యధార్ధాలు మాట్లాడాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి. ఆయనకు అలాంటి మొండి ధైర్యం ఉంది గనుకనే పిల్లి మెడలో గంట కడుతూనే ఉంటారు.

ఇదివరకు సింగరేణిలో రూ.1,600 కోట్ల నైనీ బొగ్గు గనుల వ్యవహారంలో తెలంగాణ డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి మద్య జరిగిన పంచాతీపై ఆర్‌కె ‘తొలి పలుకు’ పలికారు. అప్పుడు భట్టి విక్రమార్క బహిరంగ క్షమాపణలు లేదా లీగల్ నోటీస్ అంటూ బెదిరిస్తే, రాధాకృష్ణ సెకండ్ ఆప్షనే ఎంచుకున్నారు. అప్పుడు భట్టి వెనక్కు తగ్గారు!

ADVERTISEMENT

ఈసారి వేమూరి రాధాకృష్ణ ‘తొలి పలుకు’తో మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హర్ట్ అయ్యారు. రాధాకృష్ణపై ఫైర్ అయ్యారు.

కానీ నేడు ‘రెండో తొలి పలుకు’లో రాధాకృష్ణ మళ్ళీ ఆయనకే అనేక చురకలు వేశారు. పదవి, అధికారం, కాంట్రాక్టుల కోసం నోరు మూసుకున్నది ఎవరు?పార్టీలు మారింది ఎవరని నేను అడిగానా?

తెలంగాణ రాజకీయాలపై ఆంధ్రా మీడియా పెత్తనం చేస్తోందన్న మీరు నాడు తెలంగాణ ఉద్యమాలలో పాల్గొనకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఎందుకున్నారు. మీరు అయన భజన చేస్తుంటే ఆంధ్రజ్యోతి తెలంగాణ ఉద్యమాలకు బాసటగా నిలిచిన సంగతి మీకు గుర్తు చేయాలా? అంటూ వేమూరి రాధాకృష్ణ చాలా చురకలే వేశారు.

సిఎం రేవంత్‌ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకపోతే వెళ్ళి ఆయనతో తేల్చుకోవాలి కానీ మీడియా మీద పడి ఏడ్వడం దేనికి? అయినా మీడియాని తప్పు పడుతూ మళ్ళీ నేను వంద న్యూస్ పేపర్లు, ఛానల్స్ ఏర్పాటు చేయగలనని సవాలు విసరం దేనికి?వంద కాదు వెయ్యి పెట్టుకోండి ఎవరొద్దాన్నారు మిమ్మల్ని?” అంటూ వేమూరి వేసిన చురకలు రాజగోపాల్ రెడ్డికి పుండు మీద కారం చల్లినట్లే ఉన్నాయి.

అయితే వేమూరి రాధాకృష్ణ మరో అడుగు ముందుకు వేసి పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నం కూడా చేశారు. ఆ పిల్లి సిఎం రేవంత్‌ రెడ్డి!

రేవంత్ రెడ్డి ఎంతో శ్రమించి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలో తెచ్చారు. కానీ మూడేళ్ళలోనే కాంగ్రెస్‌ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది.

పదవులు, అధికారం అనుభవిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీల వైపు పక్క చూపులు చూస్తుంటే, రేవంత్ రెడ్డి మేల్కొనడం లేదు. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ కోవర్టుల హడావుడి పెరిగిపోతున్నా ప్రమాదం పసిగట్టడం లేదని రాధాకృష్ణ అలారం మ్రోగించారు.

అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్‌ నేతలు తమ పిలకలను కేసీఆర్‌ చేతికి ఎందుకు అప్పగించాలనుకుంటున్నారని వేమూరి రాధాకృష్ణ సూటిగా ప్రశ్నించారు. పిల్లి మెడలో గంట కట్టే ఇంత ధైర్యం ఎవరికుంది ఈ రోజుల్లో?

ADVERTISEMENT
Latest Stories