వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘సాఫ్ట్ టార్గెట్’గా భావిస్తుంటారు. అందుకే ఆయనపై నోటికి వచ్చిన్నట్లు మాట్లాడేస్తుంటారు. చివరికి ఆయన భార్య గురించి కూడా మాట్లాడేస్తుంటారు. వారికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు గట్టిగానే బుద్ధి చెప్పుతున్నారు. అది వేరే విషయం.
అయితే పవన్ కళ్యాణ్‌పై ఏమాత్రం ఆలోచించకుండా తీవ్రంగా విరుచుకుపడే మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు నిన్న ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తమ ముఖ్యమంత్రి మీద, తమ ప్రభుత్వం మీద, తమ పాలనలో అవినీతిని ప్రశ్నిస్తూ చాలా తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్కరూ ఆమెకు సమాధానం చెప్పలేదు!
ఎందుకంటే, జగన్ ప్రభుత్వం అప్పులు, కేసుల విషయంలో కేంద్రం దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంది కనుక! పైగా దగ్గుబాటి పురందేశ్వరి మహిళ. ఎన్టీఆర్ కుమార్తె. కనుక టిడిపి, జనసేన మహిళల పట్ల మాట తూలిన్నట్లు ఆమెపై మాట తూలలేరు. ఏమాత్రం తూలినా బిజెపి మహిళా మోర్చా, మహిళా సంఘాలు, ఎన్టీఆర్ అభిమానులు కూడా రంగప్రవేశం చేస్తారు.
కనుక పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడిన్నట్లు వైసీపీ నేతలు ఆమెపై విరుచుకుపడితే జగన్ ప్రభుత్వమే ఇబ్బందులలో పడుతుంది. కనుక ఆమె తమ ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు చేసినా వినబడన్నట్లు అందరూ మౌనంగా ఉండిపోయారు.
ఆమెను విమర్శించకపోయినా కనీసం ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నా కూడా వైసీపీ మంత్రులకు కష్టమే. ఎందుకంటే ఆమె చెప్పిన గణాంకాలన్నీ వాస్తవం కనుక. ఏపీలో వివిద అభివృద్ధి పనులకు, సంక్షేమ పధకాలకు కేంద్రం అందిస్తున్న ఆర్ధికసాయం గురించి మంత్రులు ఎవరూ మాట్లాడలేరు. మాట్లాడితే వాటిపై చర్చ మొదలవుతుంది. దాంతో వారి ప్రభుత్వ బండారమే బయటపడుతుంది. కనుక దగ్గుబాటి పురందేశ్వరిని ఏవిదంగా ఎదుర్కోవాలని బహుశః అంతర్గతంగా చర్చించుకొంటున్నారేమో?
అయితే ఏపీలో వైసీపీని ధీటుగా ఎదుర్కోవడానికే బిజెపి అధిష్టానం ఆమెకు ఆ బాధ్యత అప్పగించింది. కనుక ఒకవేళ వారు మౌనంగా ఉండిపోయినా ఆమె జగన్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టరు. కనుక నేడో రేపో ఆమెను ఏదోవిదంగా ఎదుర్కోక తప్పదు.



