సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో కాకుండా ట్రెండ్ సెట్ చేస్తున్నారనే చెప్పాలి. తన నియోజకవర్గమైన పిఠాపురంలో రాఖీ పండుగ సందర్భంగా 45 ఏళ్లలోపు ఉన్న సుమారు 2500 మంది ఒంటరి, వితంతు మహిళలకు పవన్ చీరల రూపంలో రక్షాబంధన్ కానుకలు అందించారు.
గత ఏడాది కూడా ఇదే తరహాలో దాదాపు 1500 మంది మహిళలకు చీరలు పంపిణి చేసిన జనసేనాని ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మహిళలకు చీరలు అందించారు. అయితే పవన్ తరుపున స్థానిక జనసేన నేతలు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు చీరలను కానుకగా అందించారు.
దీనితో ఆ మహిళలందరు మేమంతా పిఠాపురం ఎమ్మెల్యే గారి సోదరులం అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం కూడా పవన్ పిఠాపురం లోని దేవాలయంలో మహిళలకు వరలక్ష్మీ వ్రతం కానుకగా చీర, పసుపు కుంకుమ అందించడం ఆనవాయితీగా మార్చుకున్నారు.
ఇలా తన రాజకీయ గెలుపు కు, ఉప ముఖ్యమంత్రి పదవి కి కారణమైన పిఠాపురం ప్రజలకు పవన్ తనదైన స్టయిల్ లో కృతజ్ఞత చెప్పడం రాజకీయాలలో సరికొత్త ట్రెండ్ కి నాంది పలికినట్టయ్యింది. ఇదెలా ఉంటే అటు వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఇటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ సొంత చెల్లెల్లు షర్మిల, కవిత తో రాజకీయ విభేదాలు, కుటుంబ వివాదాలతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కుంటున్నారు.





