జనసేన పార్టీని నిలబెట్టి అధికారంలో తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ అనేక కష్టనష్టాలు, అవమానాలు భరించిన సంగతి తెలిసిందే. ఏ రాజకీయ పార్టీ అధినేతకైనా అవి తప్పవు. కానీ వాటన్నిటినీ తట్టుకొని నిలబడి పార్టీని బ్రతికించుకునేవాడే అంతిమ విజయం సాధిస్తాడు.
అప్పటి నుంచే అతని గొప్పదనం అందరూ గుర్తించి, మెల్లగా మునగ చెట్టు ఎక్కించడం మొదలుపెడతారు. అది వెంటనే గుర్తించినవాడు చెట్టు ఎక్కకుండా నేలపైనే ఉంటాడు. అది గుర్తించనివాళ్ళు ఏ ఫామ్‌హౌసులోనో లేదా ప్యాలస్‌లోనో పడతారు. దానిలో చిక్కుకొని బయటకు రాలేక ఇబ్బంది పడుతుంటారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, జనసేన అధినేత, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన తాజా ట్వీట్.. దానిపై ప్రకాష్ రాజ్ స్పందన.
ముందుగా నాగబాబు ట్వీట్ చూద్దాం. “నాయకుడు మాటే ఫైనల్. ఆ దారిలో ఎన్ని దెయ్యాలు, రాక్షసులు ఉన్నాయో ఎవరూ చూడలేదు. కనుక ఏది మంచి ఏది చెడు అనేది ఆయనకు మాత్రమే తెలుసు. కనుక అందరూ మీ అనుమానాలు కట్టిబెట్టి, నోరు మూసుకొని ఎటువంటి ప్రశ్నలు అడగకుండా నాయకుడిని అనుసరించండి,” అని నాగబాబు ట్వీట్ చేశారు. ప్రజల నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ అయన ఫోటో పెట్టారు.
ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్: “ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా నోరు మూసుకొని, ప్రశ్నించకుండా నాయకుడిని అనుసరించమని చెప్పడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి? మేము గొర్రెలం కాము. బానిస బ్రతుకు బ్రతకడానికి. నాగబాబుగారు ఈ బెదిరింపులు వద్దు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడినైనా… నేనే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అర్థం అయ్యిందా?” అని ట్వీట్ చేశారు.
“పార్టీకి ఏది మంచో ఏది అవసరమో నాకు తెలుసు. కనుక ఆ విషయం నాకు విడిచిపెట్టండి,” అని జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు చెప్పడం వేరు.
“ఆయనకు అన్నీ తెలుసు అందరూ నోరు మూసుకొని ప్రశ్నించకుండా గుడ్డిగా ఫాలో అవండి,” అని నాగబాబు ట్వీట్ చేయడం వేరు.
పార్టీలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో సమావేశమయ్యి ఎటువంటి భేషజాలు, దాపరికాలు లేకుండా మాట్లాడి వివరిస్తారు. అందువల్లే అయన ‘నా నిర్ణయమే ఫైనల్’ అన్నప్పుడు పార్టీలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు.
కానీ అదే మాట నాగబాబు ఈవిధంగా చెపితే వేరేలా ధ్వనిస్తోంది. నేడు జనసేన ఈ స్థాయిలో ఉందంటే అది పవన్ కళ్యాణ్, జనసైనికుల కష్టం వల్లనేనని అందరికీ తెలుసు. పార్టీ ఈ స్థాయికి చేరిన తర్వాత నాగబాబు ఈవిధంగా ట్వీట్ చేయడం అహంభావంగా అనిపిస్తుంది. అందుకే ప్రకాష్ రాజ్ వెంటనే ఇచ్చేశారు.
ప్రకాష్ రాజ్ ప్రధాని మోడీని, బిజేపిని, దాని హిందుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. కనుక బిజేపితో కనెక్ట్ అయిన దేనినైనా ఎవరినైనా గుడ్డిగా వ్యతిరేకిస్తుంటారు. అందుకే పవన్ కళ్యాణ్‌ని కూడా వ్యతిరేకిస్తున్నారనుకోవచ్చు.
కానీ నాయకుడుని గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ప్రశ్నిస్తూనే ఉండాలనే ఆయన మాట మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని గుర్తు చేస్తోంది. సహేతుకంగానే ఉంది.
మునగచెట్టు ఎక్కించేవారి కంటే నాయకులు తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఇలా చురకలు వేస్తూ అప్రమత్తం చేసేవారే నిజమైన శ్రేయోభిలాషులని అంగీకరించగలిగితే మేలే తప్ప కీడు జరుగదు.
What do you mean by “ Shut your doubts,silence your tongue and follow the Leader without questions” మేము గొర్రెలం కాదు… బానిస బ్రతుకు బ్రతకడానికి.
ఈ బెదిరింపులు వద్దు @NagaBabuOffl నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు.
ఏ నాయకుడైనా.. నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం… https://t.co/d3Y4nX5XkT— Prakash Raj (@prakashraaj) June 6, 2026




