నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ (సిసిసి) బిల్లును ప్రవేశపెట్టబోతోంది. తద్వారా కులమతాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ ఒకటే చట్టం, ఒకటే న్యాయం అమలుచేయాలని భావిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు బుదవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి సిసిసి వల్ల తమకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని కనుక పార్లమెంటులో ఆ బిల్లును అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగన్ సానుకూలంగా స్పందిస్తూ, “ఈ ప్రభుత్వం మీది. బడుగు బలహీనవర్గాలు, మైనార్టీ ప్రజలు సంక్షేమం కోరే ప్రభుత్వం ఇది. కనుక ఈ విషయంలో మీరేమీ దిగులు చెందనవసరం లేదు. ఈ సిసిసి బిల్లులో ఏముందో ఇంతవరకు ఎవరికీ తెలీదు. కానీ దాని గురించి మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతుండటంతో మీరంతా ఆందోళన చెందుతున్నట్లు అర్దమవుతోంది.
మీరే నా స్థానంలో ఉంటే ఏమి చేసేవారో చెప్పండి. ముందుగా ముస్లిం ఆడబిడ్డల హక్కుల పరిరక్షణకు మీరే వ్యతిరేకిస్తున్నారనే ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టండి. మహిళలకు సమానహక్కులు విషయంలో రాజీ పడబోమని చాటిచెప్పండి.
భారత్‌లో అనేక మతాలు, కులాలు వాటికి ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా కట్టుబాట్లు ఉన్నాయి. కనుక సిసిసి అయినా మరే నియమం అయినా అమలుచేయాలనుకొంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, లా కమీషన్, పర్సనల్ ల బోర్డులు చర్చించుకొన్న తర్వాతే అమలుచేస్తారు. ఎందుకంటే వాటి మీద వారికే అవగాహన ఉంటుంది. ఇలా కాకుండా వేరే విదంగా ముందుకు సాగడం కష్టం,” అని చెప్పారు.
అంటే సిఎం జగన్మోహన్ రెడ్డి కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు మాట్లాడారని అర్దమవుతోంది. మీరే నా స్థానంలో ఉంటే ఏం చేస్తారో చెప్పండి అంటూ ఈ విషయంలో తాను నిసహాయుడినని జగన్ చెప్పకనే చెప్పారు. అది నిజం కూడా.
ఎందుకంటే 27 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ఏపీకి ప్రత్యేకహోదా సాధించలేకపోతున్న జగన్ ప్రభుత్వం, జాతీయస్థాయి అంశమైన ఈ సిసిసి బిల్లును పార్లమెంటులో అడ్డుకోగలరనుకోవడం రాజకీయ అజ్ఞానమే అవుతుంది. పైగా కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్న జగన్ ప్రభుత్వం ఈ బిల్లును సమర్ధించకపోయినా వ్యతిరేకిస్తుందనుకోవడం ఇంకా అజ్ఞానమే.
ఆడపిల్లలకు సమానహక్కుల ప్రస్తావన చేయడం బహుశః ముందు మీరు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘ట్రిపుల్ తలాక్’ చట్టాన్ని వ్యతిరేకించడంలేదని మీ నోటితోనే మీరు చెప్పుకోండని కూడా సూచిస్తున్నట్లుంది. ఈ బిల్లు గురించి కేంద్ర ప్రభుత్వం, లాకమీషన్, సుప్రీంకోర్టు, పర్సనల్ లాబోర్డులు ఆలోచిస్తాయి కనుక మీరేమీ వర్రీ కాకండని జగన్ సర్ధిచెప్పారని అర్దమవుతూనే ఉంది.
ఇదే బిల్లు గురించి తెలంగాణలో ముస్లిం పెద్దలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి అడగగనే ఈ బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టంగా చెప్పేశారు. ఎందుకంటే కేసీఆర్ మజ్లీస్‌తో స్నేహం, మోడీ ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు కనుక. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితులు వేరు కనుక ఆవిదంగా ఖరాఖండీగా చెప్పలేరు కనుకనే ఈవిదంగా వారికే సర్ధిచెపుతున్నారు.
ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో “మీ సెంటిమెంట్ గౌరవిస్తాను” అంటూ తెలంగాణ ప్రజలకు, పార్టీ నేతలకు చెప్పారు. అలాగే ఇప్పుడు ముస్లిం పెద్దలకు కూడా చెపుతున్నారు. కనుక ఏం చేస్తారో ఊహించుకోవచ్చు.



